Gambhir vs Dhoni: ధోనీ ఇగోతో గంభీర్ ఆడుకున్నాడు.. సక్సెసయ్యాడు: మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Gambhir vs Dhoni: ధోనీ ఇగోతో గంభీర్ ఆడుకున్నాడు.. సక్సెసయ్యాడు అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బుధవారం (మే 3) చెన్నై, లక్నో మ్యాచ్ సందర్భంగా అతడీ కామెంట్స్ చేశాడు.
Gambhir vs Dhoni: ధోనీపై సక్సెస్ సాధించిన ఏకైక వ్యక్తి గంభీర్.. ధోనీ ఇగోతో అతడు ఆడుకున్నాడు అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అనడం విశేషం. ఓవైపు కోహ్లి, గంభీర్ మధ్య గొడవ నేపత్యంలో ఇర్ఫాన్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. నిజానికి కోహ్లిలాగా ధోనీ ఆవేశపరుడు కాదు. ఫేస్ టు ఫేస్ వచ్చి గొడవకు దిగేవాడూ కాదు.

కానీ గంభీర్ మాత్రం ధోనీ ఇగోతో ఎందుకు ఆడుకున్నాడన్న సందేహం రావచ్చు. ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం గంభీర్ తత్వం. అందుకే ఎంతోమంది 2011 వరల్డ్ కప్ ఘనత ధోనీదే అంటున్నా కూడా గంభీర్ చాలాసార్లు దీనితో విభేదించాడు. ధోనీ ఒక్కడి వల్లే కప్పు రాలేదని అతడు స్పష్టం చేస్తూనే ఉన్నాడు.
ఇక ధోనీ కెప్టెన్సీకి కూడా తన తెలివితేటలతో సవాలు విసిరిన వ్యక్తి గంభీర్. 2012 ఐపీఎల్ ఫైనల్ దీనికి మంచి ఉదాహరణ. అప్పుడు ధోనీ సీఎస్కే కెప్టెన్ గా ఉండగా.. గంభీర్ కేకేఆర్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి తమ వ్యూహాలకు పదును పెట్టారు. దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని బుధవారం (మే 3) లక్నో, చెన్నై మ్యాచ్ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.
ఎప్పుడూ కూల్, కామ్ గా ఉండే ధోనీని కూడా గంభీర్ వ్యూహాలు బోల్తా కొట్టించాయని పఠాన్ చెప్పాడు. గంభీర్ కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న రెండేళ్లూ ధోనీని ఔట్ చేయడానికి ప్రత్యేకంగా వ్యూహం రచించి సక్సెసయ్యాడని అతడు వెల్లడించాడు. ధోనీ బ్యాటింగ్ కు రాగానే టెస్టు మ్యాచ్ లలాంటి ఫీల్డింగ్ సెట్ చేయడం, తన ప్రధాన స్పిన్నర్లయిన సునీల్ నరైన్, పియూష్ చావ్లాలతో బౌలింగ్ చేయించడం చేశాడు.
గంభీర్ వ్యూహం ఫలించి దాదాపు ప్రతిసారీ ధోనీ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. "కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న సమయంలో ధోనీ ఇగోతో గౌతమ్ గంభీర్ ఆడుకున్నాడు. ఏళ్ల పాటు ధోనీకి అడ్డుకట్ట వేసింది గంభీర్ మాత్రమే. ఆ ఫీల్డ్ సెట్టింగ్ కు ధోనీ పూర్తిగా బిత్తరపోయాడు" అని పఠాన్ అనడం విశేషం.
సంబంధిత కథనం