Dhoni Jersey: ఆస్కార్ విన్నర్స్‌కు తన జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చిన ధోనీ
Dhoni Jersey: ఆస్కార్ విన్నర్స్‌కు తన జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చాడు ధోనీ. ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఏనుగుల కేర్ టేకర్లు బొమ్మన్, బెల్లీ.. ధోనీని కలిశారు.
Dhoni Jersey: ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ గెలవడంతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బొమ్మన్, బెల్లీలకు సీఎస్కే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ.. తన ఏడో నంబర్ జెర్సీని గిఫ్ట్ గా ఇచ్చాడు. మంగళవారం (మే 9) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ తర్వాత నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్ లో ధోనీ వాళ్లకు ఈ జెర్సీలు అందజేశాడు.
ఈ ఇద్దరితోపాటు ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కార్తీకి గోన్జాల్వెస్ కు కూడా ధోనీ తన జెర్సీ ఇచ్చాడు. ఈ డాక్యుమెంటరీ ద్వారా ఈ ఇద్దరూ అనాథలైన ఏనుగుల సంరక్షణ ఎలా చేపడతారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ డాక్యుమెంటరీలో రఘు అనే ఏనుగును వీళ్లు ఎలా పెంచి పెద్ద చేశారో చూపించారు. ఈ డాక్యుమెంటరీ ఆస్కార్స్ గెలిచింది.
అడవిలో తల్లితో వేరుపడి దిక్కుతోచని ఏనుగులను బొమ్మన్, బెల్లీలకు అటవీ శాఖ అధికారులు అప్పగిస్తారు. అలాంటి వాటి సంరక్షణను చూసుకొని తిరిగి అటవీ అధికారులకు అప్పగించే బాధ్యత వీళ్లదే. అంతేకాదు ఆ ఏనుగులే బొమ్మన్, బెల్లీలను పెళ్లి ద్వారా ఒక్కటి చేశాయి. ఈ డాక్యుమెంటరీ ద్వారా వీళ్ల గురించి తెలుసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. ఏనుగుల సంరక్షణ కోసం ముడుమలై టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ కు విరాళం కూడా అందించింది.
తమిళనాడుకు చెందిన వీళ్లు తమ డాక్యుమెంటరీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా సీఎస్కే సీఈవో కేఎస్ విశ్వనాథన్ అన్నారు. ఈ డాక్యుమెంటరీలోని రఘు, అమ్ము అనే ఏనుగుల సంరక్షణ కోసం తాము కూడా తమకు తోచినంత సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
మరోవైపు ఐపీఎల్ 2023 పాయింట్ల టేబుల్లో రెండోస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. బుధవారం (మే 10) సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ కు సీఎస్కే మరింత చేరువవుతుంది.
సంబంధిత కథనం