David Warner Record: పంజాబ్ బౌలర్లను దంచిన దిల్లీ బ్యాటర్లు.. వార్నర్ అరుదైన ఘనత-david warner become 9th time 400 plus runs in ipl history ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  David Warner Record: పంజాబ్ బౌలర్లను దంచిన దిల్లీ బ్యాటర్లు.. వార్నర్ అరుదైన ఘనత

David Warner Record: పంజాబ్ బౌలర్లను దంచిన దిల్లీ బ్యాటర్లు.. వార్నర్ అరుదైన ఘనత

David Warner Record: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ 214 పరుగులు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 9వ సారి 400కి పైగా పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా వార్నర్ రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్ చరిత్రలో డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత (AFP)

David Warner Record: ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంది మొదటగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించినప్పటికీ ఈ జట్టు అదిరిపోయే ప్రదర్శన చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 214 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో రిలే రూసో, పృథ్వీ షా అర్దశతకాలతో రాణించడా డేవిడ్ వార్నర్ 46 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అయితే వార్నర్ ఈ మ్యాచ్‌తో అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 400కి పైగా పరుగులు చేసిన వార్నర్.. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.

డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన విదేశీ ఆటగాడనే సంగతి తెలిసిందే. ప్రతి సీజన్‌లో తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వార్నర్.. ఈ సారి కాస్త నిదానంగా ఆడినప్పటికీ దిల్లీ ఇన్నింగ్స్‌లో తన వంతు పాత్ర పోషించాడు. 13 మ్యాచ్‌ల్లో అతడు 430 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో 400 పరుగుల మార్కును దిగ్విజయంగా తొమ్మిదో సారి అందుకున్నాడు. అంటే 9 సీజన్లలో అతడు 400కి పైగా పరుగులు చేశాడు.

మొత్తంగా ఈ ఘనతను సాధించిన నాలుగో ఆటగాడిగా వార్నర్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సురేష్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు తొమ్మిది సీజన్లలో 400కి పైగా పరుగులు చేసి వార్నర్ కంటే ముందున్నారు. తాజాగా వార్నర్ వారి సరసన నిలిచాడు.

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దిల్లీ బ్యాటర్లు రిలే రూసో(82), పృథ్వీషా(54) అద్భుత అర్దశతకాలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రూసో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 6 ఫోర్లు, 6 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఫలితంగా దిల్లీ భారీ స్కోరు చేయగలిగింది. మరోపక్క పృథ్వీషా కూడా చాలా కాలం గ్యాప్ తర్వాత మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ వార్నర్ 46 పరుగులతో నిలకడైన ప్రదర్శన చేశాడు. చివర్లో ఫిలిప్ సాల్ట్ 2 సిక్సర్లు, 2 ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ 2 వికెట్లు తీశాడు.