PBKS vs KKR: చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం-bhanuka rajapaksa hit to help punjab huge score against kolkata ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bhanuka Rajapaksa Hit To Help Punjab Huge Score Against Kolkata

PBKS vs KKR: చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం

Maragani Govardhan HT Telugu
Apr 01, 2023 05:30 PM IST

PBKS vs KKR: మొహాలీ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. భానుక రాజపక్స అర్ధశతకంతో అదరగొట్టగా.. ధావన్ రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీశాడు.

పంజాబ్-కోల్‌కతా
పంజాబ్-కోల్‌కతా (PTI)

PBKS vs KKR: ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బ్యాటర్ భానుక రాజపక్స(50) అర్దశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్ శిఖర్ ధావన్(40) రాణించాడు. చివర్లో సామ్ కరన్(26) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో సౌథీ 2 వికెట్లు తీయగా.. నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభమేమి దక్కలేదు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(23).. 2 ఫోర్లు 2 సిక్సర్లతో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా.. అతడిని సౌథీ ఔట్ చేయడంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స.. కెప్టెన్ ధావన్ సాయంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ నిలకడగా బ్యాటింగ్ చేయగా.. భానుక రాజపక్స ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వచ్చినప్పటి నుంచే ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన రాజపక్స అదరగొట్టాడు.

శిఖర్ ధావన్-రాజపక్స్ వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా రాజపక్స్ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వేగంగా ఆడే క్రమంలో ఉమేష్ బౌలింగ్‌లో బౌండరీలైన్ రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరు ఫోర్లతో నిలకడగా రాణించిన ధావన్ కూడా రాజపక్స ఔటైన తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ కాసేపటికే జితేశ్ శర్మ(21) సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సామ్ కరన్(26), సికిందర్ రజా(16) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. స్కోరు వేగం తగ్గినప్పటికీ నిలకడగా ఆడారు. అయితే ఓ సిక్సర్, ఓ బౌండరీతో ఆకట్టుకున్న రజాను సునీల్ నరైన్ ఔట్ చేశాడు. ఇక చివర్లో సామ్ కరన్ 2 సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో పంజాబ్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్‌కతా ముందు నిర్దేశించగలిగింది.

WhatsApp channel