No Ball winning Matches: ఒక్క నోబాల్.. మ్యాచ్‌లో మలుపు.. విజయం తారుమారు.. టాప్-5పై లుక్కేయండి-5 instances when no ball proved costly in ipl history ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  5 Instances When No Ball Proved Costly In Ipl History

No Ball winning Matches: ఒక్క నోబాల్.. మ్యాచ్‌లో మలుపు.. విజయం తారుమారు.. టాప్-5పై లుక్కేయండి

Maragani Govardhan HT Telugu
May 11, 2023 08:50 AM IST

No Ball winning Matches: క్రికెట్‌లో నోబాల్స్ వేయడం సహజమే.. కానీ టీ20 ఫార్మాట్‌లో నోబాల్స్ వేయడం వల్ల భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి ఐపీఎల్ చరిత్రలో నోబాల్స్ కారణంగా మ్యాచ్‌ మలుపు తిరిగి విజయం తారుమారైన టాప్-5 గేమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

నోబాల్‌తో మ్యాచ్ విజయం తారుమారు
నోబాల్‌తో మ్యాచ్ విజయం తారుమారు

No Ball winning Matches: టీ20 ఫార్మాట్‌లో నోబాల్స్ వేయడం పెద్ద నేరం చేయడంతో సమానం.. ఈ మాట చాలా సార్లు వింటూనే ఉంటాం. ఎందుకంటే ఒక్క నోబాల్ మ్యాచ్‌ను మలుపు తిప్పడమే కాదు.. విజయాన్ని తారుమారు కూడా చేస్తుంది. అందులోనూ డెత్ ఓవర్లలో బౌలర్లు నోబాల్స్ వేయడం వల్ల అది వారి కెరీర్‌లోనే మాయని మచ్చగా మిగిలిపోతుంది. అంతేకాకుండా ఈ విషయంలో సర్వత్రా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అర్ష్ దీప్ సింగ్, కగిసో రబాడా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఈ నోబాల్స్ కారణంగా సవాళ్లను ఎదుర్కొన్నారు. ఐపీఎల్ చరిత్రలో నోబాల్స్ కారణంగా కొన్ని జట్లు భారీ మూల్యం చెల్లించుకున్నాయి. మరి వీటి కారణంగా విజయం తారుమారైన టాప్-5 మ్యాచ్‌ల గురించి ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

సందీప్ శర్మ నోబాల్‌-RR vs SRH IPL2023..

ఈ ఐపీఎల్‌లో ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సందీప్ శర్మ వేసిన నో బాల్ రాజస్థాన్ పరజయానికి దారి తీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 214 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ ముందు ఉంచింది. అనంతరం లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్ సహాయంతో హైదరాబాద్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ 2 ఓవర్లకు 41 పరుగులు అవసరమైన తరుణంలో ఒకే ఓవర్లో 25 పరుగులు సాధించి విజయాన్ని హైదరాబాద్ వైపు తిప్పాడు.

చివరి ఓవర్‌కు 17 పరుగులు అవసరం కాగా.. సందీప్ శర్మ బౌలింగ్‌కు వచ్చాడు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ అబ్దుల్ సమద్ బ్యాటింగ్‌కు దిగాడు. ఒక్క బంతికి 5 పరుగులు అవసరం కాగా.. లాంగాప్ దిశగా భారీ షాట్ కొడతాడు అబ్దుల్. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జాస్ బట్లర్ క్యాచ్ అందుకుంటాడు. దీంతో హైదరాబాద్ ఓడిపోయిందనుకుని రాజస్థాన్ శిబిరంలో సంబరాలు మొదలవుతాయి. కానీ అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటిస్తాడు. రీప్లేలో సందీప్ క్రీజు దాటడం స్పష్టం కనిపిస్తుంది. నిరాశతో సందీప్ మళ్లీ బౌలింగ్ చేయగా.. ఈ సారి ఆ బంతిని స్ట్రైట్ సిక్సర్ కొడతాడు అబ్దుల్ సమద్. ఫలితంగా హైదరాబాద్ విజయాన్ని అందుకుంటుంది.

భువనేశ్వర్ కుమార్- RR vs SRH IPL 2022..

గత సీజన్‌లోనూ రాజస్థాన్-హైదరాబాద్ మధ్య ఇలాంటి మ్యాచే జరిగింది. అయితే అప్పుడు భువనేశ్వర్ కుమార్ తప్పిదంతో సన్‌రైజర్స్ మూల్యం చెల్లించుకుంది. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ విలియమ్సన్.. రాజస్థాన్ రాయల్స్‌ను ముందు బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తాడు. జాస్ బట్లర్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఆరంభంలో అద్బుతంగా బౌలింగ్ చేసిన భువి.. మొదటి నాలుగు బంతులను డాట్ బాల్స్‌గా మారుస్తాడు. ఐదో బంతిని బట్లర్ ఫస్ట్ స్లిప్‌లో ఉన్న అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇస్తాడు. దీంతో బట్లర్ అవుటై పెవిలియన్‌కు వెళ్తుండగా.. నోబాల్ సైరెన్ మోగుతుంది. ఫలితం బట్లర్‌కు లైఫ్ లభించింది. భువి ఇచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బట్లర్ 28 బంతుల్లో 35 పరుగులతో దూకుడుగా ఆడి రాజస్థాన్‌కు 210 పరుగుల భారీ స్కోరు చేయడంలో తోడ్పడతాడు. అనంతరం లక్ష్య ఛేధనలో విఫలమైన హైదరాబాద్.. 61 పరుగుల తేడాతో ఓడిపోతుంది.

సిరాజ్ నోబాల్- RCB vs KKR IPL 2019..

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆర్సీబీ-కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ బెంగళూరు బౌలర్ మహమ్మద్ సిరాజ్ వేసిన నోబాల్‌తో ఆ జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్17 ఓవర్లకు 153 పరుగులు చేసింది. చివరి మూడు ఓవర్లలో విజయానికి 53 పరుగులు అవసరం కాగా.. సిరాజ్ వేసిన నోబాల్‌తో ఫలితం మారిపోయింది. 18వ ఓవర్ మూడో బంతిని సిరాజ్ నోబాల్ వేయగా.. రసెల్ సిక్సర్‌గా మరలుస్తాడు. ఆ తర్వాత ఆ ఓవర్ ను స్టోయినీస్ కొనసాగించిన్పపటికీ ట్రాక్‌లోకి వచ్చిన రసెల్ మరో రెండు సిక్సర్లు బాది కోల్‌కతాకు ఆశలు చిగురింపజేస్తాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో 23 పరుగులు పిండుకుంటాడు. ఆ తర్వాత సౌథీ వేసిన 19వ ఓవర్‌లోనూ 29 పరుగులు రాబట్టి కేకేఆర్‌కు మరో 5 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందిస్తాడు రసెల్.

వినయ్ కుమార్ నోబాల్- CSK vs RCB IPL 2012..

ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ-సీఎస్‌కే జట్ల నుంచి అద్భుతమైన బ్యాటర్లు వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్ 2012 సీజన్‌లో చెపాక్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 205 పరుగులు చేస్తుంది. క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కోహ్లీ లాంటి ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతటి భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికి బెంగళూరు మ్యాచ్‌ ఓడిపోతుంది. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ బౌలర్ వినయ్ కుమార్ బౌలింగ్‌కు వస్తాడు. రెండో బంతికే మోర్కెల్‌ను ఔట్ చేస్తాడు. మ్యాచ్ ఆసక్తికరంగా మారుతున్న సమయంలో తదుపరి బంతి నోబాల్‌గా వేస్తాడు. బ్యాటింగ్ చేస్తున్న డ్వేన్ బ్రేవో దాన్ని బౌండరీ తరలిస్తాడు. ఇంతలో ఫ్రీ హిట్ కూడా రావడంతో సిక్సర్‌గా మారుస్తాడు. ఫలితంగా చెన్నై.. బెంగళూరుపై విజయం సాధిస్తుంది.

బెన్ హిల్ఫెన్హాస్ నోబాల్.. CSK vs KKR 2012 ఫైనల్..

ఇప్పటి వరకు లీగ్ మ్యాచ్‌ల్లో బౌలర్లు నోబాల్ వేసి మూల్యం చెల్లించుకున్నారు. కానీ ఐపీఎల్ ఫైనల్‌లో ఓ బౌలర్ వేసిన నోబాల్ పరిస్థితులను ఎలా తారుమారు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. ఐపీఎల్ 2012 సీజన్‌ ఫైనల్ మ్యాచ్ కోల్‌కతా -చెన్నై మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 190 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో కేకేఆర్ అద్భుత ఆటతీరుతో విజయాన్ని అందుకుంది. 19వ ఓవర్లో చెన్నై బౌలర్ బెన్ హిల్ఫెన్హాస్ బౌలింగ్‌కు వస్తాడు. కేకేఆర్ బ్యాటర్లు షకిబుల్, మనోజ్ తివారీ బ్యాటింగ్ చేస్తుంటారు. ఆ ఓవర్ చివరి బంతిని.. ఫుల్ టాస్ వేస్తాడు. షకిబుల్ 2 సహా 3 పరుగులు వస్తాయి. అది ఫుల్ టాస్ నోబాల్ అని అంపైర్ తేల్చడంతో ఫ్రీ హిట్ లభిస్తుంది. ఆ తర్వాత షకిబుల్ ఆ బంతిని బౌండరీకి తరల్చడంతో 4 పరుగులు వస్తాయి. మొత్తంగా ఆ ఓవర్‌లో 19 పరుగులు లభిస్తాయి. చివరి ఓవర్‌కు విజయానికి 9 పరుగులే అవసరం కాగా.. కేకేఆర్ బ్యాటర్ మనోజ్ తివారీ రెండు బౌండరీలు కొట్టి సులభంగా విజయాన్ని అందిస్తాడు.

WhatsApp channel