IPL Auction 2022 | 'అన్​క్యాప్డ్​' వీరులకు భారీ ధర.. ఆవేష్​కు రూ. 10కోట్లు-ipl auction 2022 uncapped players get huge demand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Auction 2022 | 'అన్​క్యాప్డ్​' వీరులకు భారీ ధర.. ఆవేష్​కు రూ. 10కోట్లు

IPL Auction 2022 | 'అన్​క్యాప్డ్​' వీరులకు భారీ ధర.. ఆవేష్​కు రూ. 10కోట్లు

HT Telugu Desk HT Telugu
Feb 12, 2022 10:05 PM IST

IPL auction latest news | ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు పేస్‌ బౌలర్‌ అవేష్‌ ఖాన్‌. అతన్ని కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆవేష్​తో పాటు పలువురు ఇతర అన్​క్యాప్డ్​ ప్లేయర్లను కూడా భారీ మొత్తానికే ఫ్రాంఛేజీలు కొనుగోలు చేశాయి. ఆ వివరాలు..

<p>ఆవేష్​ ఖాన్​..</p>
ఆవేష్​ ఖాన్​.. (PTI)

IPL uncapped players 2022 | అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ అవేష్‌ ఖాన్‌.. ఐపీఎల్​లో చరిత్ర సృష్టించాడు. కేవలం 20 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఈ పేస్‌ బౌలర్‌ కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి 50 రెట్లు ఎక్కువ చెల్లించి.. రూ.10 కోట్లకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతన్ని దక్కించుకుంది. గతంలో ఈ ఆటగాడు ఢిల్లీ తరఫున ఆడాడు.

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా వేలంలో అడుగుపెట్టిన ఆల్‌రౌండర్‌ రాహుల్ తివాతియా కోసం చెన్నై, గుజరాత్‌ మధ్య తీవ్ర పోటీ నడిచింది. గతంలో రాజస్థాన్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించిన ఈ ప్లేయర్‌ కోసం భారీ ధర చెల్లించడానికి ఫ్రాంఛైజీలు సిద్ధమయ్యాయి. దీంతో రూ.40 లక్షల బేస్‌ప్రైస్‌ నుంచి రూ.9 కోట్లకు చేరింది. గుజరాత్ టైటన్స్‌ అతన్ని దక్కించుకుంది.

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రూ.40 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి దుమ్మురేపాడు. అతని కోసం చెన్నై, కోల్‌కతా హోరాహోరీగా బిడ్స్‌ దాఖలు చేశాయి. మధ్యలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా వచ్చింది. చివరికి రూ.8.5 కోట్లు చెల్లించి అతన్ని సొంతం చేసుకుంది. కనీస ధర కంటే 20 రెట్లు అధిక ధరకు అతను అమ్ముడుపోవడం విశేషం.

అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ తీవ్రంగా ప్రయత్నించాయి. మధ్యలో గుజరాత్‌ టైటన్స్‌ కూడా చేరింది. దీంతో రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో మొదలైన అతని బిడ్డింగ్‌ కాస్తా.. రూ.6.5 కోట్లకు చేరింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌ అతన్ని కొనుగోలు చేసింది. మొత్తానికి 32 రెట్లు ఎక్కువ మొత్తానికి అతను అమ్ముడుపోవడం విశేషం.

IPL auction 2022 | ఇక యువ ఫాస్ట్‌ బౌలర్‌ కార్తీక్‌ త్యాగి సైతం ఐపీఎల్‌ వేలంలో హాట్‌ కేక్‌లా అమ్ముడయ్యాడు. అతని కోసం సన్‌రైజర్స్‌, ముంబై పోటీ పడ్డాయి. చివరికి రూ.4 కోట్లకు సన్‌రైజర్స్‌ అతన్ని దక్కించుకుంది.

ఇండియన్‌ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌ కోసం కూడా ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రూ.30 లక్షలతో ప్రారంభమైన అతని కనీస ధర ఎక్కడికో వెళ్లిపోయింది. 12 రెట్లు పెరిగి రూ.3.8 కోట్లకు చేరింది. ఇంత భారీ మొత్తానికి రాజస్థాన్‌ రాయల్స్‌ అతన్ని కొనుగోలు చేసింది.

ఉత్తరాఖండ్‌కు చెందిన అన్‌క్యాప్డ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్ అనూజ్‌ రావత్‌ అనూహ్య ధర పలికాడు. అతన్ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆంధ్రా వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ ఐపీఎల్‌ వేలంలో భారీ ధర పలికాడు. అన్‌క్యాప్డ్‌ వికెట్‌ కీపర్‌ కేటగిరీలో వేలంలోకి వచ్చిన ఈ టాలెంటెడ్‌ ప్లేయర్‌ కోసం చెన్నై, ఢిల్లీ మధ్య పోటీ నడిచింది. రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ను అతన్ని దక్కించుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం