India's Semifinals qualification scenario: ఇండియా సెమీస్‌ చేరుతుందా? పాక్‌కు ఇంకా ఛాన్స్‌ ఉందా?-indias semifinals qualification scenario and pakistan chances of making it to final 4 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Indias Semifinals Qualification Scenario And Pakistan Chances Of Making It To Final 4

India's Semifinals qualification scenario: ఇండియా సెమీస్‌ చేరుతుందా? పాక్‌కు ఇంకా ఛాన్స్‌ ఉందా?

Hari Prasad S HT Telugu
Oct 31, 2022 05:47 PM IST

India's Semifinals qualification scenario: ఇండియా టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌ చేరుతుందా? సౌతాఫ్రికాతో చేతుల్లో ఇండియా ఓటమితో పాకిస్థాన్‌కు ఇంకా ఛాన్స్‌ ఉందా? గ్రూప్‌ 2లో సెమీస్‌ చేరే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో ఓసారి చూద్దాం.

సౌతాఫ్రికా చేతుల్లో ఇండియా ఓటమితో ఆసక్తికరంగా మారిన గ్రూప్ 2 సమీకరణం
సౌతాఫ్రికా చేతుల్లో ఇండియా ఓటమితో ఆసక్తికరంగా మారిన గ్రూప్ 2 సమీకరణం (AP)

India's Semifinals qualification scenario: టీ20 వరల్డ్‌కప్‌ 2022లో ఇండియా తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచింది. గ్రూప్ 2లో టాప్‌లోకి దూసుకెళ్లింది. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమితో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇండియా రెండోస్థానానికి పడిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

పాకిస్థాన్‌తో పోలిస్తే ఇండియాకు మెరుగైన అవకాశాలే ఉన్నా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు గ్రూప్‌ 2లో ఏ టీమ్‌కు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం.

సౌతాఫ్రికా సెమీస్ బెర్త్‌ ఖాయం చేసుకున్నట్లేనా?

గ్రూప్‌ 2 ఇప్పటి వరకూ అజేయంగా ఉన్న టీమ్‌ సౌతాఫ్రికానే. మూడు మ్యాచ్‌లలో రెండు గెలవగా.. మరో మ్యాచ్‌లో గెలిచే సమయంలో వర్షం రావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ఇండియాలాంటి స్ట్రాంగ్‌ టీమ్‌పై గెలిచిన సఫారీలు ప్రస్తుతం టాప్‌లో ఉన్నారు.

వాళ్ల నెట్‌ రన్‌రేట్‌ కూడా +2.772తో చాలా బాగుంది. ఆ లెక్కన ఈ గ్రూప్‌లో అందరి కంటే ఎక్కువ సెమీస్‌ అవకాశం ఉన్న టీమ్‌ సౌతాఫ్రికానే. ఇంకా ఆ టీమ్‌ పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది.

ఇండియా పరిస్థితి ఏంటి?

ఆదివారం (అక్టోబర్‌ 30) సౌతాఫ్రికాపై గెలిచి ఉంటే టీమిండియా సెమీఫైనల్‌ చేరిపోయేది. కానీ సఫారీల చేతుల్లో అనూహ్య ఓటమితో ఇండియా కూడా సెమీస్‌ బెర్త్‌ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం (నవంబర్‌ 2) అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ కీలకం కానుంది. ఇందులో గెలిస్తే ఇండియా దాదాపు సెమీస్‌ చేరినట్లే.

ప్రస్తుతం టీమిండియా 4 పాయింట్లు, +0.844 నెట్‌ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ మూడోస్థానంలో ఉంది. జింబాబ్వేతో చివరి మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌తో రోహిత్‌ సేనకు అసలు పరీక్ష ఎదురు కానుంది. ఆ టీమ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు.

పాకిస్థాన్‌కు ఇంకా ఛాన్స్‌ ఉందా?

ఆదివారం సౌతాఫ్రికా చేతుల్లో ఇండియా ఓటమితో పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలకు పెద్ద దెబ్బే పడింది. ఇప్పటికీ సాంకేతికంగా పాక్‌కు అవకాశం ఉన్నా అది అంత సులువు కాదు. నెదర్లాండ్స్‌పై గెలిచి పాక్‌ ఊపిరి పీల్చుకున్నా.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో ఆ టీమ్‌ ఆడాల్సి ఉంది.

ఈ రెండూ కచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో ఇండియా.. బంగ్లాదేశ్‌ లేదా జింబాబ్వేలపై కనీసం ఒక మ్యాచ్‌లో అయినా ఓడిపోవాలి. పాక్‌ ప్రస్తుతం 0.765 నెట్‌ రన్‌రేట్‌తో ఐదోస్థానంలో ఉంది.

ఇక బంగ్లాదేశ్‌ రెండు చిన్న టీమ్స్ అయిన జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై గెలిచి ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అయితే ఆ టీమ్.. ఇండియా, పాకిస్థాన్‌లాంటి పెద్ద టీమ్స్‌తో ఆడాల్సి ఉండటంతో అది అంత సులువైన పని కాదనే చెప్పాలి. ఇక పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే కూడా ఒక దశలో రేసులో ఉన్నట్లు అనిపించినా.. బంగ్లాదేశ్‌తో ఓటమితో ఆ టీమ్‌ అవకాశాలకు పెద్ద దెబ్బ పడింది.

గ్రూప్‌ 2లో మిగిలి ఉన్న మ్యాచ్‌లు ఇవే..

నవంబర్‌ 2: జింబాబ్వే vs నెదర్లాండ్స్‌, ఇండియా vs బంగ్లాదేశ్‌

నవంబర్‌ 3: పాకిస్థాన్‌ vs సౌతాఫ్రికా

నవంబర్‌ 6: సౌతాఫ్రికా vs నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌ vs బంగ్లాదేశ్‌, ఇండియా vs జింబాబ్వే

WhatsApp channel