Jasprit Bumrah: మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరు? ఊహించని సమాధానమిచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా-indian pacer jasprit bumrah reveals the toughest batsman to bowl ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jasprit Bumrah: మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరు? ఊహించని సమాధానమిచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah: మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరు? ఊహించని సమాధానమిచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా

Galeti Rajendra HT Telugu

Jasprit Bumrah Records: జస్‌ప్రీత్ బుమ్రా మైదానంలోనే కాదు వెలుపల కూడా తనకి ఎదురయ్యే సవాళ్లు, ప్రశ్నలకి ప్రశ్నలకి యార్కర్ లాంటి సమాధానాలు ఇస్తుంటాడు. కెరీర్‌లో ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరు అని అడిగితే? బుమ్రా చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?

జస్‌ప్రీత్ బుమ్రా (PTI)

భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కెరీర్‌లో దొరికిన బ్రేక్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన జస్‌ప్రీత్ బుమ్రా.. భారత్ జట్టు విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆ మెగా టోర్నీ తర్వాత భారత సెలక్టర్లు ఈ పేసర్‌కి విశ్రాంతినివ్వగా.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న సిరీస్‌తో భారత్ జట్టుకి బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

తమిళనాడులోని సత్యభామ యూనివర్సిటీకి వెళ్లిన జస్‌ప్రీత్ బుమ్రాకి అక్కడి విద్యార్థులు ఒక ప్రశ్న సంధించారు. ‘‘కెరీర్‌లో మీరు బౌలింగ్ చేసిన టఫెస్ట్ బ్యాటర్ ఎవరు?’’ అని ప్రశ్నించగా.. జస్‌ప్రీత్ బుమ్రా చాలా తెలివిగా ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు. సాధారణంగా ఇప్పటి వరకు బౌలర్లు ఇలాంటి ప్రశ్న ఎదురైతే బ్యాటర్ల పేర్లు చెప్తుంటారు. కానీ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఏ బ్యాటర్ పేరు చెప్పలేదు.

‘‘నేను బౌలింగ్ చేసేటప్పుడు తొలుత ఏ బ్యాటర్ కూడా నాపై ఆధిపత్యం చెలాయించకుండా జాగ్రత్తపడతా. అందుకు తగినట్లుగా నేను ప్రిపేర్ అవుతా.. నా మైండ్‌ను కూడా ప్రిపేర్ చేసుకుంటా. నా సామర్థ్యాన్ని నమ్మి నా పని నేను చేస్తాను. అలా అని బ్యాటర్లను తక్కువ చేయడం కాదు. నేను బౌలింగ్ చేసే ప్రతి బ్యాటర్‌నీ గౌరవిస్తా. కానీ మన పని మనం కరెక్ట్ చేస్తే ప్రపంచంలో మనల్ని ఎవరూ ఆపలేరు. అదొక్కటే నేను మననం చేసుకుంటా’’ అని జస్‌ప్రీత్ బుమ్రా వెల్లడించాడు.

ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా.. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. దాంతో బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కింది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ తర్వాత భారత్ జట్టుకి ఆస్ట్రేలియా పర్యటన రూపంలో అతి పెద్ద సవాలు ఎదురుకాబోతోంది.

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఈ ఏడాది చివరి నుంచి భారత్ జట్టు ఆడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2018-19లో 21 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా.. భారత్ జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. దాంతో మరోసారి బుమ్రా నుంచి అదే స్థాయి ప్రదర్శనని భారత్ జట్టు ఆశిస్తోంది. బుమ్రా గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా విశ్రాంతినిస్తోంది.