Sunil Chhetri Last Match: కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న లెజెండరీ ప్లేయర్.. కాసేపట్లోనే ప్రారంభం.. ఎక్కడ చూడాలంటే?
Sunil Chhetri Last Match: ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. కాసేపట్లో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా కువైట్ తో ఇండియా ఆడబోయే మ్యాచే అతని కెరీర్లో చివరిది.
Sunil Chhetri Last Match: రెండు దశాబ్దాలుగా ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ లో కీలక సభ్యుడిగా, కెప్టెన్ గా ఎన్నో మరుపురాని విజయలు సాధించి పెట్టిన సునీల్ ఛెత్రీ రిటైరవుతున్నాడు. తన కెరీర్లో చివరి మ్యాచ్ ను గురువారం (జూన్ 6) అతడు కువైట్ తో ఆడనున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా ఈ మ్యాచ్ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరగనుంది.

సునీల్ ఛెత్రీ ఘనతలు
ఫుట్‌బాల్ నుంచి తాను రిటైరవనున్నట్లు గత నెలలోనే సునీల్ ఛెత్రీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కువైట్ తో జరగబోయే మ్యాచే కెరీర్లో చివరదని అతడు చెప్పాడు. 39 ఏళ్ల ఛెత్రీ.. రెండు దశాబ్దాల తన కెరీర్ కు ముగింపు పలకబోతున్నాడు. 1984, ఆగస్ట్ 3న జన్మించిన అతడు 2002లో 18 ఏళ్ల వయసులో మోహన్ బగాన్ తరఫున తన ప్రొఫెషనల్ కెరీర్ మొదలు పెట్టాడు.
కెరీర్లో సునీల్ ఛెత్రీ ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నాడు. 2007, 2009, 2012 నెహ్రూ కప్ విజయాల్లో ఛెత్రీదే కీలకపాత్ర. అంతేకాకుండా ఇండియా 2011, 2015, 2021, 2023లలో సాఫ్ ఛాంపియన్షిప్స్ గెలవడంలోనూ ఛెత్రీ తన వంతు పాత్ర పోషించాడు. 2008లో ఛెత్రీ ఇండియాను ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్ లో విజయం వైపు తీసుకెళ్లాడు. ఇది 27 ఏళ్ల తర్వాత ఇండియాకు ఏఎఫ్‌సీ ఏషియాన్ కప్ లో చోటు దక్కేలా చేసింది.
19 ఏళ్ల తన అంతర్జాతీయ కెరీర్లో సునీల్ ఛెత్రీ మొత్తం 150 మ్యాచ్ లలో 94 గోల్స్ చేశాడు. రొనాల్డో, అలీ దాయీ, మెస్సీ తర్వాత అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఛెత్రీదే కావడం విశేషం. ఇండియాకు అతడు అందించిన సేవలకుగాను ఛెత్రీకి అర్జున అవార్డు కూడా దక్కింది.
నా గురించి, నా చివరి మ్యాచ్ గురించి కాదు: ఛెత్రీ
తన కెరీర్లో చివరి మ్యాచ్ చుట్టూ నెలకొన్న హైప్ ను సునీల్ ఛెత్రీ తేలిగ్గా తీసుకున్నాడు. "మనలో చాలా మంది 20 రోజుల కిందటే కలిసి నా చివరి మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం. అంతటితో అది ముగిసింది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది కేవలం ఇండియా, కువైట్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికే. నా చివరి మ్యాచ్ లాగా దీనిని చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను" అని ఛెత్రీ అన్నాడు.
"దీనిని నా చివరి మ్యాచ్ అనే దృష్టితో చూడొద్దని మరోసారి కోరుతున్నాను. ఇది మాకు, కువైట్ మధ్య మ్యాచ్ కు సంబంధించినది. నాలో నేను ఓ చిన్న యుద్ధమే చేస్తున్నాను. ఎలా ఫీలవుతున్నారని అడిగి దానిని మరింత దారుణంగా మార్చకండి. డ్రెస్సింగ్ రూమ్ లో దీని గురించి అసలు ఆలోచించడం లేదు. మీరే ఈ ప్రశ్నలు అడుగుతున్నారు" అని ఛెత్రీ అన్నాడు.
ఛెత్రీ చివరి మ్యాచ్ ఎక్కడ చూడాలంటే?
ఇండియా, కువైట్ మధ్య కీలకమైన వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ గురువారం సాయంత్రం 7 గంటల నుంచి కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ను జియో సినిమాలో ఉచితంగా చూసే అవకాశం ఉంది. ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ లెజెండరీ ప్లేయర్ కు వీడ్కోలు మ్యాచ్ చూడటానికి మీరు కూడా రెడీ అయిపోండి.