IND vs WI: యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ.. అరంగేట్రంలోనే అదుర్స్.. రోహిత్ కూడా శతకం
IND vs WI: టీమిండియా తరఫున బరిలోకి దిగిన తొలి టెస్టులోనే యువ స్టార్ యశస్వి జైస్వాల్ శతకంతో అదరగొట్టాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.
IND vs WI: భారత యువ సంచలన బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. టీమిండియా తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్‍లోనే శతకంతో చెలరేగాడు. భారీ అంచనాలను నిజం చేశాడు. వెస్టిండీస్‍తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు టీమిండియా యంగ్ తరంగ్ యశస్వి (244 బంతుల్లో 116 పరుగులు నాటౌట్; 12 ఫోర్లు). డొమినికా వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజైన నేడు జైస్వాల్‍తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (221 బంతుల్లో 103 పరుగులు; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా శతకంతో అదరగొట్టాడు. అయితే, ఆ తర్వాత రోహిత్, శుభ్‍మన్ గిల్ (6) వెనువెంటనే ఔటయ్యారు. దీంతో రెండో రోజు రెండో సెషన్ ముగిసే సరికి భారత్ 81 ఓవర్లలో రెండు వికెట్లకు 245 పరుగులు చేసింది. 95 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. జైస్వాల్, విరాట్ కోహ్లీ (4 నాటౌట్) బ్యాటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. రెండో రోజు ఆట ఇంకా 32 ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా ముందుకు వెళుతోంది.
80 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో టీమిండియా రెండో రోజు ఆటను మొదలుపెట్టింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఆచితూచి ఆడుతూనే వీలైనప్పుడల్లా బౌండరీలు బాదారు. వెస్టిండీస్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. ఈ క్రమంలో 104 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు యశస్వి జైస్వాల్.
కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 106 బంతుల్లో అర్ధ శకతం చేశాడు. దీంతో లంచ్ విరామ సమయానికి వికెట్ కోల్పోకుండా 146 పరుగులు చేసింది టీమిండియా. లంచ్ తర్వాత కూడా భారత ఓపెనర్లు అదే జోరు కొనసాగించారు. ఆతిథ్య విండీస్ బౌలర్లకు చెమటలు పట్టించారు. నిలకడగా ఆడుతూ పరుగులు చేసుకుంటూ పోయారు. దీంతో వికెట్ కోల్పోకుండానే ఆధిక్యంలోకి దూసుకొచ్చింది భారత్. వేగం పెంచిన యశస్వి జైస్వాల్ 215 బంతుల్లో శతకం చేశాడు. అరంగేట్రంలోనే అదరొగొట్టాడు. సెంచరీ తర్వాత సంబరాలు చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 17వ భారత బ్యాట్స్‌మన్‍గా యశస్వి నిలిచాడు. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 220 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో రోహిత్‍కు ఇది పదో శతకం. అయితే, కాసేపటికే విండీస్ బౌలర్ అతనాజే బౌలింగ్‍లో హిట్‍మ్యాన్ ఔటయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్ మూడో స్థానంలో వచ్చిన శుభ్‍మన్ గిల్ (6).. వారికన్ బౌలింగ్ ఔటై త్వరగా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చాడు విరాట్.
తొలి రోజు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ అయిదు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశారు. భారత స్పిన్నర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు నిలువలేకపోయారు. డెబ్యూటంట్ అలిక్ అతనాజే (47) మినహా వెస్టిండీస్‍లో ఏ బ్యాటర్ రాణించలేకపోయారు.