India vs West Indies: యశస్వి జైస్వాల్ ఓపెనింగ్.. మూడోస్థానంలో శుభ్‌మన్ గిల్: రోహిత్ శర్మ
India vs West Indies: యశస్వి జైస్వాల్ ఓపెనింగ్.. మూడోస్థానంలో శుభ్‌మన్ గిల్ వస్తాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. వెస్టిండీస్ తో జరగబోయే తొలి టెస్టు తుది జట్టు గురించి రోహిత్ చెప్పాడు.
India vs West Indies: ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించి నేషనల్ టీమ్ కు ఎంపికైన యశస్వి జైస్వాల్ తన టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు. వెస్టిండీస్ తో బుధవారం (జులై 12) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో యశస్వి ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. రోహిత్, యశస్వి ఓపెనర్లుగా రానుండగా.. శుభ్‌మన్ గిల్ మూడోస్థానంలో వస్తాడు.
సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారాను ఈ సిరీస్ కు ఎంపిక చేయకపోవడంతో అతని స్థానంలో గిల్ బ్యాటింగ్ కు రానుండటం విశేషం. డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న యశస్వికి.. ఆడే అవకాశం అయితే రాలేదు. అయితే వెస్టిండీస్ టూర్ కు ఎంపికవడమే కాదు.. తొలి టెస్టులోనే ఆడే అవకాశం కూడా వస్తుండటం విశేషం.
ఈ సిరీస్ కోసం రుతురాజ్ గైక్వాడ్ ను కూడా ఎంపిక చేసినా.. అతని కంటే ముందే యశస్వి టెస్ట్ అరంగేట్రం చేస్తున్నాడు. ఇక తొలి టెస్టులో ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు కూడా సీనియర్ జర్నలిస్ట్ విమల్ కుమార్ తో మాట్లాడుతూ రోహిత్ చెప్పాడు. యశస్వి ఓపెనింగ్ చేయనుండటంతో అతని ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ అతనికి శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది.
న్యూ ఎరా అంటూ ఓ క్వొశ్చన్ మార్క్ పెట్టి రాయల్స్ ఈ ట్వీట్ చేసింది. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో సెంచరీలతోపాటు ఐపీఎల్ 2023లోనూ యశస్వి రాణించాడు. దీంతో టీమిండియాలో అతనికి చోటు దక్కింది. ఈ సీజన్ లో అతడు 625 రన్స్ చేసింది.
వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు ఇండియన్ టీమ్ ఇదే
రోహిత్ శర్మ, అజింక్య రహానే, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నవదీప్ సైనీ