India vs Sri Lanka 2nd T20: సంజూ స్థానంలో రాహుల్ త్రిపాఠీ.. లంకతో రెండో టీ20కి తుది జట్టు ఇదే
India vs Sri Lanka 2nd T20: సంజూ స్థానంలో రాహుల్ త్రిపాఠీ తుది జట్టులోకి రానున్నాడు. శ్రీలంకతో ఇప్పటికే తొలి టీ20 గెలిచిన టీమిండియా.. రెండో మ్యాచ్‌కు రెండు మార్పులు చేయనుంది.
India vs Sri Lanka 2nd T20: సంజూ శాంసన్.. మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ అయినా.. తగినన్ని అవకాశాలు అతనికి రాలేదు. వచ్చిన సమయాల్లో వాటిని కొన్నిసార్లు సద్వినియోగం చేసుకోలేదు. ఇక ఇప్పుడు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌తోనే అతని కథ ముగిసింది. ఈ మ్యాచ్‌లో మోకాలి గాయానికి గురవడంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
అతని స్థానంలో జితేన్‌శర్మను జట్టులోకి తీసుకున్నారు. అయితే శ్రీలంకతో గురువారం (జనవరి 5) జరగబోయే రెండో టీ20కి తుది జట్టులో మాత్రం శాంసన్ స్థానంలో రాహుల్ త్రిపాఠీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌తో త్రిపాఠీ తన హోమ్‌గ్రౌండ్ అయిన పుణెలో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు.
76 ఐపీఎల్ మ్యాచ్‌లలో అతడు 1798 రన్స్ చేశాడు. సగటు 28 కాగా.. 140 స్ట్రైక్ రేట్‌గా ఉంది. పది హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తానికి ఇండియన్ టీమ్‌కు ఆడాలన్న అతని కల ఇలా నెరవేరుతోంది. అయితే అతనికి పుణెకే చెందిన రుతురాజ్ గైక్వాడ్ నుంచి పోటీ ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. శాంసన్ స్థానంలో రుతురాజ్‌కు కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు.
రుతురాజ్ కూడా టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ మధ్యే లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక శాంసన్‌తోపాటు రెండో టీ20కి మరో మార్పు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. తొలి టీ20కి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయిన పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు తిరిగి రావచ్చు. మరో పేసర్ హర్షల్ పటేల్ స్థానంలో అర్ష్‌దీప్‌ను తీసుకోవచ్చు.
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఇండియా ఉంది.
రెండో టీ20కి ఇండియా తుది జట్టు: శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠీ, శివమ్ మావి, యుజువేంద్ర చహల్, హర్షల్/అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్