India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మ్యాచా మజాకా.. చుక్కలనంటుతున్న హోటల్ రూమ్స్ ధరలు
India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మ్యాచా మజాకా! అహ్మదాబాద్ లో చుక్కలనంటుతున్నాయి హోటల్ రూమ్స్ ధరలు. వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 15న ఈ రెండు టీమ్స్ నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్న విషయం తెలిసిందే.
India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ప్రపంచంలో మరే ఇతర మ్యాచ్ కు ఉండదంటే అతిశయోక్తి కాదు. అందులోనూ పదేళ్లుగా ఈ రెండు టీమ్స్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడకపోవడంతో ఎప్పుడోగానీ ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో తలపడటం లేదు. దీంతో ఎన్నాళ్లకెన్నాళ్లకంటూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.
తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా కూడా అక్టోబర్ 15న ఈ దాయాదులు తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ లో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వబోతోంది. లక్ష మంది కూర్చొని చూసే వీలున్న ఈ స్టేడియంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని అంచనా వేయడంలో ఆశ్చర్యమేమీ లేదు.
హోటల్ రూమ్‌కు రూ.లక్ష
అయితే స్టేడియం బయట సిటీలో హోటల్ రూమ్స్ కు కూడా అదే రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది. అహ్మదాబాద్ లో అక్టోబర్ 15న హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలంటే రెండు దేశాల అభిమానులకు తడిసి మోపెడు కానుంది. అక్కడి హోటల్ గదుల అద్దె ఆ రోజు పది రెట్ల వరకూ పెరిగింది. కొన్ని హోటళ్లయితే ఒక్క రోజుకే రూ.లక్ష వసూలు చేస్తున్నాయి.
అందులో చాలా వరకూ రూమ్స్ ఇప్పటికే బుక్ అయిపోవడం మరో విశేషం. అహ్మదాబాద్ లో సాధారణంగా లగ్జరీ హోటళ్లలో ఒక రోజు ఉండటానికి రూ.5 వేల నుంచి రూ.8 వేలు వసూలు చేస్తారు. కానీ ఆ మ్యాచ్ రోజు మాత్రం రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ డిమాండ్ చేస్తున్నారు. booking.com ప్రకారం జులై 2న అక్కడి వెల్‌కమ్ హోటల్లో రూమ్ ధర రూ.5699. అదే అక్టోబర్ 15న అదే రూమ్ ధర రూ.71999 కావడం గమనార్హం.
రెనైసాన్స్ అహ్మదాబాద్ హోటల్ రోజుకు సాధారణంగా రూ.8 వేలు ఛార్జ్ చేస్తుంది. కానీ ఆ రోజు మాత్రం రూ.90679గా నిర్ణయించింది. ఇలాగే ప్రైడ్ ప్లాజా హోటల్, ది కామా హోటల్, ఐటీసీ నర్మద, కోర్ట్‌యార్డ్, హయత్, తాజ్ స్కైలైన్ అహ్మదాబాద్ లాంటి హోటల్స్ కూడా రేట్లు పెంచేశాయి. వీటిలో ఇప్పటికే అన్ని రూమ్స్ బుక్కయిపోయాయి.
ఈ మ్యాచ్ చూడటానికి వచ్చే ఎన్నారైలు, ఇండియాలోనే ఉండే ధనవంతులు భారీ ధర చెల్లించి మరీ ఈ హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు. డిమాండ్ కు తగినట్లే హోటల్ రూమ్స్ ధరలు పెరిగిపోయాయని గుజరాత్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ చెబుతోంది.
సంబంధిత కథనం