India vs Pakistan Test at MCG: మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఇండియా, పాకిస్థాన్‌ టెస్ట్‌ మ్యాచ్‌!-india vs pakistan test at mcg melbourne cricket councils new proposal with cricket australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Vs Pakistan Test At Mcg Melbourne Cricket Councils New Proposal With Cricket Australia

India vs Pakistan Test at MCG: మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఇండియా, పాకిస్థాన్‌ టెస్ట్‌ మ్యాచ్‌!

Hari Prasad S HT Telugu
Dec 29, 2022 09:19 PM IST

India vs Pakistan Test at MCG: చారిత్రక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఇండియా, పాకిస్థాన్‌ టెస్ట్‌ మ్యాచ్‌ నిర్వహిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడిదే ప్రతిపాదనతో ముందుకు వచ్చింది మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ).

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌
మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌

India vs Pakistan Test at MCG: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఎలాంటి ఆదరణ వచ్చిందో మనం చూశాం. ఏకంగా 90 వేల మందికిపైగా ప్రేక్షకులతో చారిత్రక ఎంసీజీ కిక్కిరిసిపోయింది. ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద స్టేడియం అయిన ఎంసీజీ ఇప్పుడు అలాంటిదే మరో మ్యాచ్‌ నిర్వహించాలని భావిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈసారి ఇండియా, పాకిస్థాన్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ నిర్వహించాలని ఎంసీజీ తహతహలాడుతోంది. ఈ గ్రౌండ్‌ను నిర్వహించే మెల్‌బోర్న్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఎంసీసీ) టెస్ట్‌ నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తోంది. ఎంసీసీతోపాటు స్థానిక విక్టోరియా ప్రభుత్వం కూడా ఈ టెస్ట్‌ నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాను కోరడం గమనార్హం.

2007 తర్వాత ఇండియా, పాకిస్థాన్‌లు టెస్ట్‌ మ్యాచ్ ఆడలేదు. ఇక 2013 నుంచి ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలో తప్ప ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ ఈ దాయాదులు తలపడలేదు. అయితే ఇప్పుడీ దేశాల మధ్య టెస్ట్‌ నిర్వహించడానికి మెల్‌బోర్న్‌ క్రికెట్‌ కౌన్సిలే ముందుకు రావడం విశేషం.

"కచ్చితంగా. ఎంసీజీలో మూడు వరుస టెస్ట్‌లు చాలా అద్భుతంగా ఉంటాయి. మేము కూడా అడిగాం. క్రికెట్‌ ఆస్ట్రేలియాతో చర్చించాం. విక్టోరియా ప్రభుత్వం కూడా అడిగింది. అయితే అది అంత సులువు కాదని తెలుసు. చాలా బిజీ షెడ్యూల్‌ ఉంది. అదే అతిపెద్ద సవాలు. కేవలం ఆస్ట్రేలియా, విక్టోరియా టీమ్స్ చుట్టే తిరగకుండా అన్ని టీమ్స్‌కు అవకాశం ఇచ్చి స్టేడియాలను నింపాలన్నది మా ఆలోచన. ఇది అద్భుతంగా ఉంటుంది కదా" అని ఎంసీసీ అభిప్రాయపడింది.

"క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ అంశాన్ని ఐసీసీతో చర్చించి ఆ దిశగా ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఖాళీ స్టేడియాలు చూస్తుంటే.. ఇలాంటి మ్యాచ్‌లను నిర్వహించి స్టేడియాలను పూర్తిగా నింపే దిశగా ఆలోచన చేయవచ్చు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఎంసీజీలో జరిగిన మ్యాచ్‌ను గతంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటి వాతావరణం కూడా ఎప్పుడూ అనుభూతి చెందలేదు. ప్రతి బాల్‌ తర్వాత ప్రేక్షకులు చేసే శబ్దం అద్భుతం. ఇప్పుడు ఇండియా, పాకిస్థాన్ టెస్ట్‌ మ్యాచ్‌ కూడా నిర్వహించి స్టేడియం పూర్తిగా నింపేయాలని భావిస్తున్నాం" అని ఎంసీసీ తెలిపింది.

WhatsApp channel