Telugu News  /  Sports  /  India Vs New Zealand 3rd Odi Called Off Due To Rain As New Zealand Won The Series
వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిన మూడో వన్డే
వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిన మూడో వన్డే (AP)

India vs New Zealand 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు.. సిరీస్‌ గెలిచిన న్యూజిలాండ్

30 November 2022, 15:08 ISTHari Prasad S
30 November 2022, 15:08 IST

India vs New Zealand 3rd ODI: వర్షంతో మూడో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. తొలి వన్డే గెలిచిన న్యూజిలాండ్‌ సిరీస్‌ను 1-0తో ఎగరేసుకుపోయింది. రెండో వన్డే కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

India vs New Zealand 3rd ODI: టీమిండియా మూడో వన్డే ఓడకుండా వరుణుడు కాపాడాడు. అయితే సిరీస్‌ మాత్రం న్యూజిలాండ్‌ సొంతమైంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. తొలి వన్డేలో గెలిచిన న్యూజిలాండ్‌ 1-0తో సిరీస్‌ను గెలుచుకుంది. అచ్చూ టీ20 సిరీస్‌లాగే వన్డే సిరీస్‌ ముగిసినా.. ఫలితం తారుమారైంది.

ట్రెండింగ్ వార్తలు

బుధవారం (నవంబర్ 30) జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 219 రన్స్‌కే చాప చుట్టేయగా.. తర్వాత న్యూజిలాండ్‌ చేజింగ్‌ను ధాటిగా మొదలుపెట్టింది. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి ఆ టీమ్‌ 18 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 104 రన్స్‌ చేసింది. మరో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే మ్యాచ్‌లో ఫలితం వచ్చేది.

అప్పటికే డీఎల్‌ఎస్‌ స్కోరు కంటే న్యూజిలాండ్‌ 50 పరుగులు ముందే ఉన్నా.. కనీసం 20 ఓవర్ల ఆట పూర్తి కాకపోవడంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 18వ ఓవర్‌ ముగిసిన తర్వాత మొదలైన వర్షం కురుస్తూనే ఉంది. ఆ తర్వాత మ్యాచ్‌ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం..

అంతకుముందు టీమిండియా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 47.3 ఓవర్లలో భారత్ 219 పరుగులకు ఆలౌటైంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌లపై టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. వాషింగ్టన్ సుందర్(51) అర్ధశతకం, శ్రేయాస్ అయ్యర్ 49 పరుగులు మినహా మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆరంభం నుంచి టీమిండియా ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. మరోపక్క కివీస్ బౌలర్లలో ఆడం మిల్నే, డారిల్ మిచెల్ చెరో 3 వికెట్లతో అదరగొట్టగా.. టిమ్ సౌథీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ప్రారంభం నుంచి ఓపెనర్లు నిదానంగా ఆడటంతో 9 ఓవర్లకు 39 పరుగులే చేయగలిగింది. ఆ సమయలో శుబ్‌మన్ గిల్‌ను(13) ఔట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. ఆ కాసేపటికే శిఖర్ ధావన్‌ను(28) కూడా బౌల్డ్ చేయడంతో భారత పతనం ప్రారంభమైంది. అనంతరం రిషబ్ పంత్(10) కూడా డారిల్ మిచెల్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(6) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలుచోలేకపోయాడు. ఆడం మిల్నే బౌలింగ్‌లో సౌధీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఓ పక్క శ్రేయాస్ అయ్యర్(49) బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును కాస్త ముందుకు నడిపించాడు. అతడు ఉన్నంత సేపు స్కోరు ఫర్వాలేదనిపించింది. అయితే సూర్యకుమార్ ఔటైన తర్వాత అతడు లోకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో భారత్ కష్టాలు మొదలయ్యాయి. 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో నిలిచింది. బ్యాటర్లంతా ఔట్ కావడంతో ఓ దశలో 150 పరుగులైనా చేస్తుందా అనే సందేహం వచ్చింది.

ఇలాంటి సమయంలో వాషింగ్టన్ సుందర్(51) ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్ల సహాయంతో మరో 97 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ.. సుందర్ ఏ మాత్రం అవకాశమివ్వలేదు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచాడు. టెయిలెండర్లు అండతో టీమిండియాకు ఓ మోస్తరు స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ నమోదు చేశాడు. సిక్సర్‌తో పరుగులు పూర్తి చేశాడు. 64 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. మొత్తానికి 47.3 ఓవర్లలో 210 పరుగులకు టీమిండియా ఆలౌటైంది.