India vs New Zealand 1st ODI: శిఖర్, శ్రేయస్, శుభ్‌మన్ హాఫ్ సెంచరీల మోత.. టీమిండియా భారీ స్కోరు
India vs New Zealand 1st ODI: శిఖర్, శ్రేయస్, శుభ్‌మన్ హాఫ్ సెంచరీల మోత మోగిండంతో న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. సూర్య, పంత్ విఫలమైనా.. టీమ్ ఫైటింగ్ స్కోరు సాధించింది.
India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియా భారీ స్కోరు చేసింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడంతోపాటు చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్ 76 బాల్స్‌లో 80 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కేవలం 16 బాల్స్‌లోనే 37 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ 49వ ఓవర్లలో సుందర్ వరుసగా 4, 4, 6 కొట్టాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్నిచ్చారు. కాస్త నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టినా.. తర్వాత జోరు పెంచారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 23.1 ఓవర్లలో 124 రన్స్ జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. ముఖ్యంగా కెప్టెన్ ధావన్ వేగంగా ఆడాడు. అతడు 77 బాల్స్‌లో 72 రన్స్ చేశాడు. ధావన్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి.
ఇక శుభ్‌మన్ గిల్ 65 బాల్స్‌లో 50 రన్స్ చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్లు ఇద్దరూ ఒకే స్కోరు దగ్గర ఔటవడంతో ఇండియన్ టీమ్ కాస్త ఒత్తిడిలో కనిపించింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 32 రన్స్ జోడించారు. ఈ దశలో ఒకే ఓవర్లో మరోసారి ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది.
ఫెర్గూసన్ వేసిన ఆ ఓవర్లో మొదట రిషబ్ పంత్ (15) ఔటవగా.. ఆ వెంటనే ఫామ్‌లో ఉన్న బ్యాటర్ సూర్యకుమార్ (4) కూడా పెవిలియన్ చేరాడు. వచ్చీ రాగానే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించినా.. మరుసటి బంతికే వికెట్ పారేసుకున్నాడు. దీంతో ఇండియా 160 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో మరోసారి శ్రేయస్‌అయ్యర్, సంజూ శాంసన్ టీమ్‌ను ఆదుకున్నారు. ఇద్దరూ ఐదో వికెట్‌కు 94 పరుగులు జోడించడంతో ఇండియా భారీ స్కోరు సాధించగలిగింది. సంజూ శాంసన్ 36 రన్స్ చేశాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు టీమ్ భారీ స్కోరుకు బాటలు వేశాయి.