Telugu News  /  Sports  /  India Vs Bangladesh In Adelaide Facing The Threat Of Rain
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ (ANI)

India vs Bangladesh: ఇండియా, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు.. పాయింట్లు పంచుకోవాల్సిందేనా!

01 November 2022, 14:25 ISTHari Prasad S
01 November 2022, 14:25 IST

India vs Bangladesh: ఇండియా, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం (నవంబర్‌ 2) ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది.

India vs Bangladesh: టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌ 12 స్టేజ్‌లో ఇండియా తన నాలుగో మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచినా.. మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతుల్లో అనూహ్యంగా ఓడిపోయిన టీమిండియా సెమీస్‌ బెర్త్‌ ఇంకా ఖాయం చేసుకోలేదు. ఒకవేళ బంగ్లాదేశ్‌పై గెలిస్తే ఈ అవకాశాలు మరింత మెరుగవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు వర్షం అడ్డు పడే అవకాశం ఉంది. మ్యాచ్‌ జరిగే అడిలైడ్‌లో సోమ, మంగళవారాల్లో వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం టీమ్‌ అక్కడ ల్యాండవగా.. వరుణుడు స్వాగతం పలికాడు. ఇక మంగళవారం కూడా ప్రాక్టీస్‌ సెషన్‌ జరగాల్సి ఉండగా.. 95 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

మ్యాచ్‌ జరిగే బుధవారం (నవంబర్‌ 2) కూడా వాతావరణం మేఘావృతమై ఉండనుంది. 70 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అయితే వర్షపాతం 1-3 మిల్లీమీటర్లు మాత్రమే ఉండే అవకాశం ఉండటంతో మ్యాచ్ రద్దయ్యే ప్రమాదమైతే కనిపించడం లేదు. సోమ, మంగళవారాలతో పోలిస్తే బుధవారం వర్షం పడే అవకాశాలు కూడా తక్కువగానే ఉండటంతో మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశం ఉండొచ్చు.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ తప్పిదాలు.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లాంటివి ఆందోళన కలిగించాయి. ఆ టీమ్‌పై గెలిచి ఉంటే ఇండియన్‌ టీమ్‌ నేరుగా సెమీస్‌కు వెళ్లిపోయేదే. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ అంత సులువు కాదు. ఆ టీమ్‌ గతంతో పోలిస్తే బలంగానే ఉంది. పైగా ఆ టీమ్‌ కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ కూడా ఇండియన్‌ టీమ్‌ సెమీస్‌ అవకాశాలను దెబ్బతీస్తామని హెచ్చరించాడు.

ఈ మ్యాచ్‌కు వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. అతడు సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఒకవేళ కార్తీక్‌ ఆడలేకపోతే రిషబ్‌ పంత్‌ తుది జట్టులోకి వస్తాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ 16వ ఓవర్‌ నుంచి కార్తీక్‌ స్థానంలో పంతే వికెట్‌ కీపింగ్‌ చేసిన విషయం తెలిసిందే. కార్తీక్‌ కూడా అభిమానులు ఆశించిన ఫామ్‌లో లేకపోవడంతో అతన్ని తప్పించి అయినా పంత్‌ను తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.