Ind vs Aus 3rd T20 Tickets: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్ టీ20 కోసం టికెట్ల విక్రయం ఆరంభం
Ind vs Aus 3rd T20 Tickets: ఉప్పల్ వేదికగా జరగనున్న మూడో టీ20 కోసం టికెట్ల విక్రయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించింది. గురువారం నాడు జింఖానా గ్రౌండ్స్‌లో ఈ టికెట్లను విక్రయిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Uppal T20 Tickets Sale: ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి మ్యాచ్‌ను మొహాలీ వేదికగా నిర్వహించారు. అయితే రెండో టీ20 నాగ్‌పుర్ వేదికగా.. మూడో మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇదిలా ఉంటే మూడో టీ20 కోసం ఉప్పల్ స్టేడియంలో టికెట్ల విక్రయం వివాదానికి దారితీసింది. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని అభిమానుల నుంచి ఫిర్యాదు వచ్చాయి. దీంతో టికెట్లు గురువారం నాడు ఒక్కరోజు ఆఫ్ లైన్‌లో విక్రయించనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) వెల్లడించింది.
సికింద్రాబాద్‌లో జింఖానా గ్రౌండ్స్‌లో ఉప్పల్ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో టికెట్లను విక్రయించనున్నట్లు తెలిపింది. హెచ్‌సీఏ నుంచి ఈ ప్రకటన రావడంతో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో జింఖానా గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచే పడిగాపులు గాస్తున్నారు. ఒక్క టికెట్టయినా దక్కించుకోవాలని తీవ్రంగా పోటీ పడుతున్నారు. క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.
సెప్టెంబరు 15 నుంచి పేటీఎంలో ఉప్పల్ టీ20కి సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచారు. కానీ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే అన్నీ అయిపోయాయి. చాలా మందికి టికెట్లు కూడా దొరకలేదు. టికెట్లు బుక్ అయిన వారికి కూడా ఆ తర్వాత క్యాన్సిల్ అయ్యాయి. టికెట్లు క్యాన్సిల్ అవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హెచ్‌సీఏ తీరుపై మండిపడ్డారు. ఆఫ్‌లైన్‌లో అయినా కొనుగోలు చేయాలనుకుంటే టికెట్లు ఎక్కడా విక్రయించలేదు. ఉప్పల్ స్టేడియానికి వెళ్తే.. జింఖానా గ్రౌండ్స్‌కు వెళ్లాలని, అక్కడకి వెళ్తే.. స్టేడియం వద్దే విక్రయిస్తారని అటూ ఇటూ తిప్పారే తప్పా ఎక్కడా మ్యాచ్ టికెట్లు ఇవ్వలేదు. దీంతో హెచ్‌సీఏ వైఖరిపై అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుటున్నారని మండిపడ్డారు. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 55 వేలు ఉంటే.. కనీసం 20 వేలు కూడా విక్రయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వత్రా విమర్శలు ఎదురుకావడంతో గురువారం ఒక్కరోజు ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నట్లు హెచ్‌సీఏ తెలిపింది. దీంతో టికెట్లు దక్కించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో చివరగా 2019 డిసెంబరులో వెస్టిండీస్‌తో భారత టీ20 ఆడింది. అప్పటి నుంచి మరో మ్యాచ్ జరగలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఇక్కడ నిర్వహించ లేదు. చాలా రోజుల తర్వాత ఉప్పల్ వేదికగా మ్యాచ్‌లు జరుగుతుండటంతో అభిమానులు టికెట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.
సంబంధిత కథనం