India vs Hong Kong: ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్ టీమిండియా భారీ స్కోరు చేసింది. సూర్య, విరాట్ చెలరేగిపోయారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 రన్స్ చేసింది. హాంకాంగ్ బౌలర్లను చితగ్గొట్టిన సూర్యకుమార్ కేవలం 26 బాల్స్‌లో 68 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. చివరి ఓవర్లోనే సూర్య ఏకంగా 4 సిక్స్ లు బాదడం విశేషం.
మరోవైపు విరాట్ కోహ్లి కూడా 44 బాల్స్‌లో 59 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 42 బాల్స్‌లోనే 98 రన్స్ జోడించారు. ఇన్నింగ్స్ మొత్తం సూర్యకుమార్ షోనే నడిచింది. అతడు క్రీజులోకి వచ్చే వరకూ నత్తనడకన సాగిన ఇండియా ఇన్నింగ్స్ అతని రాక తర్వాత ఒక్కసారిగా రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది.
మరోవైపు చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లి ఓ హాఫ్ సెంచరీ బాదడమే ఫ్యాన్స్‌కు చాలా థ్రిల్‌ను ఇచ్చింది. అతడు 40 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో అతనికిది 31వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ ఫిఫ్టీ ప్లస్ స్కోరుతో మరోసారి అతడు టీ20ల్లో 50కిపైగా సగటును సాధించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి స్టార్టే ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలో 38 రన్స్ జోడించారు. రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి మంచి ఊపు మీద కనిపించిన రోహిత్.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. రోహిత్ 13 బాల్స్‌లో 21 రన్స్ చేశాడు. ఆ తర్వాత రాహుల్‌తో జత కలిసిన కోహ్లి కూడా తన తొలి మ్యాచ్ ఫామ్ కొనసాగించాడు.
హాంకాంగ్‌లాంటి టీమ్‌పై ఈ ఇద్దరూ అనుకున్న స్థాయిలో వేగంగా పరుగులు చేయలేకపోయినా.. మెల్లగా పార్ట్‌నర్‌షిప్ బిల్డ్ చేశారు. చాలా రోజుల తర్వాత టీమ్‌లోకి తిరిగొచ్చి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన రాహుల్.. ఈ మ్యాచ్‌లో తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టినా.. మునుపటి రాహుల్‌ను తలపించలేకపోయాడు. చివరికి 38 బాల్స్‌లో 36 రన్స్ చేసి ఔటయ్యాడు. కోహ్లితో కలిసి రాహుల్ రెండో వికెట్‌కు 56 రన్స్ జోడించాడు.