Pv Sindhu: పెళ్లి తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి సింధు రీఎంట్రీ - ఫస్ట్ మ్యాచ్‌లోనే గ్రాండ్ విక్టరీ!
Pv Sindhu: పెళ్లి తర్వాత తాను ఆడుతోన్న తొలి టోర్నీలోనే పీవీ సింధు అదరగొట్టింది. ఇండియా ఓపెన్ సూపర్ 750 తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన యున్ సుంగ్‌ను 21-14, 22-20 చిత్తు చేసింది. రెండో రౌండ్‌లో జపాన్ షట్లర్‌తో మినామీ సుజుతో పోరుకు సిద్ధమైంది.
Pv Sindhu: ఇండియన్ బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. వెంకటదత్త సాయితో సింధు వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 22న ఘనంగా జరిగింది.
గ్రాండ్ విక్టరీ...
పెళ్లి జరిగి నెల రోజులు కూడా కాకముందే సింధు తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత తాను ఆడుతోన్న తొలి టోర్నీని గ్రాండ్ విక్టరీ తో ప్రారంభించింది. ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో తొలి రౌండ్‌లో సింధు చైనీస్ తైపీకి యున్ సుంగ్‌పై 21-14, 22-20 తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
51 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆరంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. తొలి సెట్‌లో సింధు జోరు ముందు యున్ సుంగ్ ఏ మాత్రం నిలవలేకపోయింది. రెండో రౌండ్‌లో పుంజుకున్న యున్ సుంగ్‌కు సింధుకు గట్టిపోటీ ఇచ్చింది. రెండో రౌండ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది.
ప్రత్యర్థి బోల్తా...
ఒకానొక దశలో స్కోర్లు సమంగా మారాయి. మూడో రౌండ్‌కు కూడా మ్యాచ్ చేరడం ఖాయంగా కనిపించింది. తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ప్రత్యర్థిని సింధు బోల్తా కొట్టించింది.
రెండో మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన మినామీ సుజుతో సింధు తలపడనుంది. గురువారం ఈ మ్యాచ్ జరుగనుంది. సింధుతో పాటు అనుపమ ఉపాధ్యయ కూడా రౌండ్ 16కు చేరుకుంది.
ప్రణయ్‌కి షాక్...
ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో తొలి రౌండ్‌లోనే మెన్స్ స్టార్ షట్లర్ ప్రణయ్ ఇంటిముఖం పట్టాడు. చైనీస్ తైపీకి లీ యాంగ్ చేతిలో 21-16. 18-21, 12-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.
ఉదయ్‌పూర్‌లో...
కాగా సింధు, వెంటక దత్త సాయి పెళ్లి ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ జరిగింది. సింధు భర్త వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 14న ఈ జంట ఎంగేజ్‌మెంట్ జరిగింది.