Kho Kho World Cup: విశ్వవిజేతగా భారత్.. ఖో ఖో తొలి ప్రపంచకప్ గెలిచిన ఇండియా పురుషుల, మహిళల జట్లు
Kho Kho World Cup 2025: ఖో ఖో ప్రపంచకప్‍లో భారత్ అదరగొట్టింది. పురుషుల, మహిళల జట్లు టైటిల్ సాధించి సత్తాచాటాయి. తొలిసారి జరిగిన మెగాటోర్నీలో విశ్వవిజేతలుగా నిలిచాయి.
తొలిసారి జరిగిన ఖో ఖో ప్రపంచకప్ టోర్నీలో ఇండియా జట్లు అద్బుతం చేశాయి. భారత పురుషుల, మహిళల జట్లు విశ్వవిజేతలుగా నిలిచాయి. ఫస్ట్ వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్స్ కైవసం చేసుకున్నాయి. నేడు (జనవరి 19) న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా జరిగిన ఖో ఖో ప్రపంచకప్ 2025 తుదిపోరులో ఇండియా టీమ్‍లు సత్తాచాటాయి. ఫైనల్‍లో నేపాల్‍పై భారత మహిళ జట్టు 78-40 తేడాతో భారీ విజయం సాధించింది. తొలి ప్రపంచకప్ ట్రోఫీ దక్కించుకుంది. పూర్తి ఆధిపత్యంతో సత్తాచాటారు భారత ప్లేయర్లు.
భారత పురుషుల జట్టు కూడా ఫైనల్‍లో నేపాల్‍పై 54-36 తేడాతో గెలిచి టైటిల్ సాధించింది. తుదిపోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇండియా ఫస్ట్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడ్డాయి. చివరికి భారత్, నేపాల్ ఫైనల్ చేరాయి. తుదిపోరులోనూ ఇండియా ప్లేయర్లు తిరుగులేని వ్యూహం పాటించి.. అదిరే ఆటతో అదరగొట్టటంతో టైటిల్ కైవసం అయింది. ఈ ప్రపంచ కప్‍తో భారత పల్లె క్రీడ ఖో ఖో విశ్వవ్యాప్తం అయింది. ఈ టోర్నీలో 19 మహిళల జట్లు పోటీ పడ్డాయి.
అమ్మాయిలు అదుర్స్
ఫైనల్ పోరులో భారత మహిళా ప్లేయర్లు ఆరంభం నుంచే అదరగొట్టారు. నేపాల్‍పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. టర్న్ 2 ముగిసే సరికే భారత్ 34 పాయింట్లు సాధించింది. చైత్రా బీ దుమ్మురేపారు. ఇండియన్ ప్లేయర్ల దూకుడుతో నేపాల్ ఆసాంతం వెనుకంజలోనే సాగింది. టర్న్ 4 ముగిసే సరికి భారత్‍కు 78 పాయింట్లు దక్కాయి. నేపాల్ 40 పాయింట్లకే పరిమితం అయింది. దీంతో భారీ తేడాతో గెలిచిన ఇండియా మహిళల జట్టు మొట్టమొదటి ఖో ఖో ప్రపంచకప్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది.
ఈ ప్రపంచకప్‍లో దక్షిణ కొరియా, ఇపాన్, మలేషియా జట్లపై గ్రూప్ దశలో భారత్ గెలిచింది. క్వార్టర్ ఫైనల్‍లో బంగ్లాదేశ్, సెమీస్‍లో దక్షిణాఫ్రికాపై ఆధిపత్య విజయాలు సాధించింది. తుదిపోరులోనూ నేపాల్‍ను చిత్తు చేసి భారత మహిళల జట్టు విశ్వవిజేత అయింది.
పురుషుల టీమ్ ఆధిపత్య విజయం
భారత పురుషుల జట్టు కూడా ప్రపంచకప్ ఫైనల్‍లో సత్తాచాటింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. నేపాల్‍ను డిఫెన్స్‌లోకి నెట్టింది. ప్రతీ టర్నుకు ఆధిక్యం పెంచుకుంటూ పోయింది. రెండో టర్న్ ముగిసే సరికి భారత్ 26-18తో ముందంజలో నిలిచింది. చివరికి నాలుగు టర్నుల్లో 54-36తో ఆధిక్యంలో ఉండి ఫైనల్‍లో విజయం సాధించింది. టైటిల్ కైవసం చేసుకుంది. భారత ప్లేయర్ సుయాష్ గార్గెట్‍కు బెస్ట్ ఆటాకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సంబంధిత కథనం