Asia Cup 2022: రోహిత్‌కు అఫ్రిదీ రికార్డు బద్దలుకొట్టే అవకాశం.. ఏంటంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టే రికార్డును బద్దలు కొట్టేందుకు హిట్ మ్యాన్‌కు అవకాశముంది.
ఆసియా కప్‌నకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం క్రికెట్ ఆడే ఆసియా దేశాలు సమాయత్తమయ్యాయి. సెప్టెంబరు 11 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో సత్తా చాటి అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో రాణించాలని జట్లన్నీ ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఆసియా కప్‌లో అత్యధికంగా 8 సార్లు విజేతగా నిలిచి అగ్రస్థానంలో ఉంది టీమిండియా. ఎన్నో రికార్డులు ఈ టోర్నీలో బద్దలయ్యయాయి. ఈ సారి కూడా కొన్ని రికార్డుల అధిగమించే అవకాశముంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఆసియా కప్‌లో పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ రికార్డు బద్దలు కొట్టే అవకాశముంది. ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు(26) రికార్డును బద్దలు కొట్టే అవకాశం హిట్ మ్యాన్‌కు ఉంది. అతడు ఈ ఘనత సాధించాలంటే మరో 6 సిక్సర్లు బాదితే చాలు. ఇప్పటి వరకు ఆసియా కప్‌లో 27 మ్యాచ్‌ల్లో 21 సిక్సర్లు కొట్టాడు.
ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు..
షాహిద్ అఫ్రిదీ(పాకిస్థాన్)- 27 మ్యాచ్‌ల్లో 26 సిక్సర్లు నమోదు చేశాడు
సనత్ జయసూర్య(శ్రీలంక)- 25 మ్యాచ్‌ల్లో 23 సిక్సర్లు
రోహిత్ శర్మ(భారత్)- 27 మ్యాచ్‌ల్లో 21 సిక్సర్లు
సురేశ్ రైనా(భారత్)- 18 మ్యాచ్‌ల్లో 18 సిక్సర్లు
ఎంఎస్ ధోనీ(భారత్)- 24 మ్యాచ్‌ల్లో 16 సిక్సర్లు కొట్టాడు.
ఈ విధంగా సిక్సర్ల రికార్డే కాకుండా రోహిత్ శర్మకు మరో రికార్డు అధిగమించే అవకాశముంది. ఆసియా కప్‌లో 1000 పరగులు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించే అవకాశముంది. ఇప్పటి వరకు హిట్ మ్యాన్ 27 మ్యాచ్‌ల్లో 883 పరుగులు చేశాడు. ప్రస్తుతం సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. మన మాస్టర్ బ్లాస్టర్ ఈ టోర్నీలో 23 మ్యాచ్‌ల్లో 971 పరుగులు నమోదు చేశాడు. ఈ విషయంలో అందరికంటే అగ్రస్థానంలో శ్రీలంక మాజీ ప్లేయర్ సనత్ జయసూర్య ముందున్నాడు. అతడు 25 మ్యాచ్‌ల్లో 1220 పరుగులు చేశాడు. అనంతరం శ్రీలంకకే చెందిన కుమార సంగక్కర 24 మ్యాచ్‌ల్లో 1075 పరుగులు చేశాడు.
ఆసియా కప్‌లో వెయ్యి పరుగులు క్లబ్‌లో చేరేందుకు విరాట్ కోహ్లీకి కూడా అవకాశముంది. అతడు 16 మ్యాచ్‌ల్లో 766 పరుగులు చేశాడు. అయితే ఇటీవల ఫామ్ చూస్తుంటే ఆ పరుగులు అందుకోవడం సందేహంగానే మారింది. ఎందుకంటే ఈ ఏడాది కోహ్లీ కేవలం నాలుగంటే నాలుగే టీ20లు ఆడాడు.
సంబంధిత కథనం
టాపిక్