India vs China: ఫైనల్‍లో చైనాను చిత్తు చేసిన భారత్.. ఐదోసారి ఆసియా ట్రోఫీ కైవసం-india beat china to clinch fight asian champions trophy title jugraj singh goal secures final win hockey news ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs China: ఫైనల్‍లో చైనాను చిత్తు చేసిన భారత్.. ఐదోసారి ఆసియా ట్రోఫీ కైవసం

India vs China: ఫైనల్‍లో చైనాను చిత్తు చేసిన భారత్.. ఐదోసారి ఆసియా ట్రోఫీ కైవసం

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 17, 2024 06:55 PM IST

India vs China - Asian Champions trophy 2024: భారత హాకీ జట్టు ఐదోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్‍లో చైనాను ఓడించి టైటిల్‍ను పట్టింది. హోరాహోరీగా జరిగిన తుదిపోరులో చివర్లో గోల్ చేసి విజయం సాధించింది.

India vs China: ఫైనల్‍లో చైనాను చిత్తు చేసిన భారత్.. ఐదోసారి ఆసియా ట్రోఫీ కైవసం
India vs China: ఫైనల్‍లో చైనాను చిత్తు చేసిన భారత్.. ఐదోసారి ఆసియా ట్రోఫీ కైవసం

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ మరోసారి ఆధిపత్యాన్ని చాటింది. చైనా వేదికగా జరిగిన ఈ ఏడాది ఎడిషన్‍లో అదిరే ఆటతో టైటిల్ సాధించింది. నేడు (సెప్టెంబర్ 17) జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‍లో భారత్ 1-0 తేడాతో ఆతిథ్య చైనాపై సూపర్ విజయం సాధించింది. దీంతో ఐదోసారి ఆసియా టైటిల్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది.

భారత్, చైనా మధ్య ఫైనల్ పోరు జోరుగా సాగింది. అయితే, 51న నిమిషంలో జుగ్‍రాజ్ సింగ్ గోల్ చేయటంతో భారత్ ఖాతా తెరిచింది. చైనా గట్టిపోటీనే ఇచ్చింది. 1-0తో గెలిచి టైటిల్ దక్కించుకుంది టీమిండియా.

హోరాహోరీగా పోరు

ఈ ఫైనల్‍లో ముందుగా భారత్ దూకుడుగా ఆడగా.. చైనా తడబడినట్టు కనిపించింది. కానీ ఆరంభంలో టీమిండియా గోల్ సాధించలేదు. కాసేపటికే చైనా కూడా దీటుగా ఆడింది. ఆరో నిమిషంలో భారత ప్లేయర్ సుమీత్.. గోల్ట్ పోస్ట్ వైపు బలమైన షాట్ కొట్టగా.. చైనా గోల్ కీపర్ వాంగ్ విహావో అడ్డుకున్నాడు. 10వ నిమిషంలో వచ్చిన తొలి పెనాల్టీ కార్నర్‌ను భారత కెప్టెన్ హర్మన్‍ప్రీత్ సింగ్ మిస్ చేశాడు.

ఆ తర్వాత మరో పెనాల్టీ కార్నర్ వచ్చినా టీమిండియాకు గోల్ మిస్ అయింది. 14వ నిమిషంలో సుఖ్‍జీత్ సూపర్ షాట్ కొట్టినా.. మరోసారి అడ్డుకున్నాడు చైనీస్ గోల్‍కీపర్ విహావో. భారత్‍కు మరిన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. చైనా గట్టిపోటీ ఇచ్చింది. దీంతో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

గోల్ బాదిన జగ్‍రాజ్

రెండో అర్ధభాగం కూడా భారత్, చైనా జోరుగా ఆడాయి. గోల్స్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా హోరీహోరీగా ఆటగాళ్లు ఆడారు. దీంతో గోల్ ఎప్పుడొస్తుందా అనే ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ తరుణంలో 51వ నిమిషంలో జగ్‍రాజ్ సింగ్ గోల్ బాదాడు. చైనీస్ గోల్‍కీపర్‌ను బోల్తా కొట్టించి గోల్ కొట్టాడు. దీంతో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా. చివరి వరకు దూకుడుగా ఆడింది. మొత్తంగా ఒక్క గోల్ తేడాతో చైనాపై భారత్ విజయం సాధించింది.

ఐదో టైటిల్

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించడం భారత్‍కు ఇది ఐదోసారి. డిఫెండింగ్ చాంపియన్‍గా బరిలోకి దిగిన హర్మన్‍ప్రీత్ సారథ్యంలోని టీమిండియా మరోసారి ట్రోఫీ దక్కించుకుంది. 2011, 2016, 2018, 2023ల్లో టైటిల్ గెలిచిన భారత హాకీ జట్టు.. ఇప్పుడు ఐదోసారి ఆసియా విజేతగా నిలిచింది. భారత కెప్టెన్ హర్మన్‍ప్రీత్ సింగ్.. హీరో ఆఫ్ ది టోర్మమెంట్‍గా నిలిచాడు.