దేశం గర్వించదగ్గ క్రీడాకారులలో మొదటి పేరు, ప్రపంచంలోనే గొప్ప హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్. అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఘనత ధ్యాన్ చంద్ కు దక్కుతుంది. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశం ఒకటి కాదు, రెండు కాదు, మూడు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించింది.
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాల తర్వాత కూడా, ఒలింపిక్స్‌లో మనకు లభించే వెండి లేదా కాంస్య పతకాలను తదుపరి ఒలింపిక్స్‌కు వరకూ గుర్తుంచుకుని సంబరాలు చేసుకుంటాం. కానీ ధ్యాన్‌చంద్ జట్టు ఒలింపిక్స్‌లో నిలకడగా బంగారు పతకాలు సాధించింది.
1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిల్స్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారతదేశం వరుసగా మూడు ఒలింపిక్ హాకీ బంగారు పతకాలను గెలుచుకోవడంలో ధ్యాన్ చంద్ కీలకపాత్ర పోషించాడు. 1928 ఫైనల్‌లో భారత్ ఆతిథ్య నెదర్లాండ్స్‌ను 3-0 స్కోరుతో ఓడించగా, 1932 బంగారు పతక పోరులో భారత్ 24-1తో అనూహ్యమైన స్కోరుతో అమెరికాను ఓడించింది. 1936లో జర్మనీపై ఫైనల్‌లో 8-1 తేడాతో భారత్ గెలిచింది. మొత్తంగా, ధ్యాన్ చంద్ 12 ఒలింపిక్ మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్ చేశాడు.
ధ్యాన్ చంద్ ఆగస్ట్ 29, 1905న జన్మించారు. ప్రయాగ్, ఉత్తరప్రదేశ్ అతడి స్వస్థలం. ధ్యాన్ చంద్ తండ్రి ఇండియన్ బ్రిటిష్ ఆర్మీలో కానిస్టేబుల్. చదువును తొందరగా మానేసిన ధ్యాన్ చంద్ పదహారేళ్ల వయసులో సైన్యంలో చేరాడు. దీని ద్వారా దేశ సేవలో నిమగ్నమయ్యాడు. కానీ హాకీలో అతని నైపుణ్యం అతన్ని హాకీ యార్డ్‌కు తీసుకువచ్చింది.
బెర్లిన్ ఒలింపిక్స్‌లో ధ్యాన్‌చంద్ ఆటకు హిట్లర్ ఆకర్షితుడయ్యాడు. అతడిని జర్మనీ తరపున సేవలందించమని విజ్ఞప్తి చేశాడు. కానీ హిట్లర్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు. దేశం పట్ల ప్రేమను వ్యక్తం చేశాడు ధ్యాన్ చంద్. దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా భారతదేశంలో క్రీడా దినోత్సవంగా జరుపుకొంటారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం గర్వించదగ్గ క్రీడాకారులలో ఒకరికి నివాళులు అర్పిద్దాం.