Ind vs WI day 1 highlights: సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్.. శుభ్‌మన్ గిల్ అదిరే స్టెప్పులు.. తొలి రోజు హైలైట్స్ ఇవే
Ind vs WI day 1 highlights: సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్.. శుభ్‌మన్ గిల్ అదిరే స్టెప్పులు ఇండియా, వెస్టిండీస్ తొలి టెస్ట్ తొలి రోజు హైలైట్స్ గా నిలిచాయి. వీళ్లకు తోడు అశ్విన్ పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
Ind vs WI day 1 highlights: ఇండియా, వెస్టిండీస్ తొలి టెస్ట్ తొలి రోజు అశ్విన్, యశస్వి మెరుపులే కాదు.. సిరాజ్, గిల్ హైలైట్స్ కూడా ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ తో అందరినీ షాక్ కు గురి చేయగా.. శుభ్‌మన్ గిల్ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. మొత్తానికి విండీస్ గడ్డపై తొలి రోజును ఇండియన్ ప్లేయర్స్ బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు.
సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తొలి రోజు ఓ స్టన్నింగ్ క్యాచ్ తో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్ చివరి బంతికి విండీస్ బ్యాటర్ బ్లాక్‌వుడ్ మిడాఫ్ మీదుగా బౌండరీ బాదడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్.. వెనక్కి పరుగెత్తుతూ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి బ్లాక్‌వుడే కాదు.. ఇండియన్ ఫీల్డర్లు కూడా షాక్ తిన్నారు.
గిల్ సూపర్ స్టెప్పులు
టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తొలి రోజు డ్యాన్స్ చేయడం కూడా హైలైట్ గా నిలిచింది. విండీస్ 148 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో 63 ఓవర్లు ముగిసిన తర్వాత ఫార్వర్డ్ షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్.. ఒక్కసారిగా జాలీమూడ్ లోకి వచ్చేశాడు. విండీస్ బ్యాటర్లు ఎండ్స్ మారుతుండగా.. బౌండరీ బయటి నుంచి వస్తున్న మ్యూజిక్ కు స్టెప్పులేశాడు. అతన్ని కోహ్లి అలా చూస్తుండిపోయాడు.
అశ్విన్ రికార్డులు
తొలి రోజే ఐదు వికెట్లతో అశ్విన్ పలు రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. అశ్విన్ టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ను వెనక్కి నెట్టాడు. ఇక వెస్టిండీస్ పై అతడు ఐదోసారి ఐదు వికెట్ల కంటే ఎక్కువ తీసుకున్నాడు. ఇండియా, వెస్టిండీస్ టెస్టుల్లో మాల్కమ్ మార్షల్ అత్యధికంగా ఆరుసార్లు ఐదు వికెట్లు, అంతకంటే ఎక్కువ తీశాడు. ఇప్పుడు అశ్విన్.. హర్భజన్ తో కలిసి రెండోస్థానంలో ఉన్నాడు.
ఈ ఐదు వికెట్లతో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ లో 700 వికెట్లు మైలురాయి కూడా అందుకున్నాడు. ఇండియన్ బౌలర్స్ లో కుంబ్లే, హర్భజన్ తర్వాతి స్థానం అశ్విన్ దే. కుంబ్లే 956 వికెట్లు తీయగా.. హర్భజన్ 711 వికెట్లు తీశాడు. అశ్విన్ ప్రస్తుతం 702 వికెట్లతో ఉన్నాడు. ఇక టెస్ట్ క్రికెట్ లో అత్యధిక మందిని బౌల్డ్ చేసిన ఇండియన్ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. ఇప్పటి వరకూ కుంబ్లే (94) పేరిట ఉన్న రికార్డును 95వ బౌల్డ్ తో అశ్విన్ బ్రేక్ చేశాడు.