IND vs WI 2nd Test: సిరాజ్ ‘పాంచ్’ పటాకా.. వెస్టిండీస్ ఆలౌట్.. భారత్‍కు మంచి ఆధిక్యం-ind vs wi 2nd test highlights west indies all out for 255 runs indian pacer mohammad siraj takes five wickets details in ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Wi 2nd Test Highlights West Indies All Out For 255 Runs Indian Pacer Mohammad Siraj Takes Five Wickets Details In

IND vs WI 2nd Test: సిరాజ్ ‘పాంచ్’ పటాకా.. వెస్టిండీస్ ఆలౌట్.. భారత్‍కు మంచి ఆధిక్యం

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 23, 2023 08:23 PM IST

IND vs WI 2nd Test: వెస్టిండీస్‍ను రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే కట్టడి చేసింది టీమిండియా. భారత పేసర్ సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

మహమ్మద్ సిరాజ్
మహమ్మద్ సిరాజ్ (AFP)

IND vs WI 2nd Test: వెస్టిండీస్‍తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‍కు మంచి ఆధిక్యం లభించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజైన నేడు (జూలై 23) వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. 229 పరుగులకు 5 వికెట్ల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన విండీస్ నేడు 26 పరుగులు మాత్రమే చేసిన మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్‍లోనే కుప్పకూలింది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (5/60) ఐదు వికెట్లతో విజృంభించి వెస్టిండీస్‍ను దెబ్బతీశాడు. డెబ్యుటంట్ పేసర్ ముకేశ్ కుమార్‌కు రెండు, స్పిన్నర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు దక్కాయి. విండీస్ 255 పరుగులకు ఆలౌటవటంతో టీమిండియాకు 183 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‍కు దిగనుంది టీమిండియా.

ట్రెండింగ్ వార్తలు

5 వికెట్లకు 229 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో వెస్టిండీస్ నాలుగో రోజు ఆటకు దిగింది. అలిక్ అథనాజే (37), జేసన్ హోల్డర్ (15) బ్యాటింగ్ కొనసాగించారు. నేటి ఆట తొలి ఓవర్లోనే అథనాజేను భారత పేసర్ ముకేశ్ కుమార్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే హోల్డర్‌ను పెవిలియన్‍కు పంపాడు సిరాజ్. అల్జారీ జోసెఫ్ (4) బౌండరీ బాది మంచి ఆరంభాన్ని అందుకున్నా.. ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. తర్వాతి ఓవర్లో జోసెఫ్‍ను ఎల్బీడబ్ల్యూ చేసి మరింత దెబ్బకొట్టాడు సిరాజ్.

అనంతరం విండీస్ టేలెండర్లు కీమర్ రోచ్ (4), జోమెల్ వారికన్ (7 నాటౌట్) భారత బౌలర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కీమర్ రోచ్, షానోన్ గాబ్రియెల్‍(0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు సిరాజ్. దీంతో 255 పరుగులకే ఆలౌటైంది వెస్టిండీస్. నాలుగో రోజు కేవలం 7.4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లను కోల్పోయింది విండీస్. అంతకు ముందు మూడో రోజు క్రెగ్ బ్రాత్‍వైట్ (75) రాణించటంతో ఆ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది విండీస్.

ఈ మ్యాచ్ డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతో మూడో రోజు నిదానంగా ఆడిన వెస్టిండీస్.. నాలుగో రోజు మాత్రం కుప్పకూలింది. దీంతో గెలిచే అవకాశాలు టీమిండియాకు పెరిగాయి. నేడు వేగంగా పరుగులు చేసి భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇచ్చేందుకు చూడనుంది.

కాగా, ఈ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 438 పరుగులు చేసింది.

WhatsApp channel