Telugu News  /  Sports  /  Icc T20i Team Of 2022 Announced As Virat Surya And Hardik Are In The Team
సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి
సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి (BCCI Twitter)

ICC T20I Team of 2022: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ 2022లో విరాట్, సూర్య.. ఇంకా ఎవరున్నారంటే?

23 January 2023, 15:26 ISTHari Prasad S
23 January 2023, 15:26 IST

ICC T20I Team of 2022: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ 2022లో విరాట్, సూర్య, హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. గతేడాది టీ20ల్లో ఇరగదీసిన ప్లేయర్స్ అందరూ ఈ టీమ్ లో ఉన్నారు.

ICC T20I Team of 2022: టీమిండియా గతేడాది టీ20 వరల్డ్ కప్ లో విఫలమైంది. కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది. అయితే తాజాగా సోమవారం (జనవరి 23) ఐసీసీ ప్రకటించిన టీ20 టీమ్ ఆఫ్ 2022లో మాత్రం ఏకంగా ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ చోటు దక్కించుకోవడం విశేషం. మొత్తం 11 మంది ప్లేయర్స్ లో ముగ్గురు మన వాళ్లే ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా గతేడాది టీ20ల్లో టాప్ స్కోరర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టీమ్ లో ఉన్నారు. ఇక గతేడాది టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ను విజేతగా నిలిపిన కెప్టెన్ జోస్ బట్లర్ ఈ టీమ్ కు కెప్టెన్ గా ఉన్నాడు. అయితే మొత్తంగా ఈ జట్టులో ఎక్కువ మంది ఇండియన్ ప్లేయర్సే ఉండటం విశేషం.

ఇక ఇండియా తర్వాత ఇంగ్లండ్, పాకిస్థాన్ టీమ్స్ నుంచి ఇద్దరేసి ప్లేయర్స్ ఉండగా.. న్యూజిలాండ్, ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంకల నుంచి తలా ఒక ప్లేయర్ ఈ జట్టులో చోటు సంపాదించారు. ఈ జట్టులో కోహ్లిని చేర్చడంపై ఐసీసీ స్పందిస్తూ.. అతడు మునపటి ఫామ్ లోకి వచ్చిన ఏడాది 2022 అని చెప్పింది.

"2022 పాత విరాట్ కోహ్లిని మళ్లీ అందించింది. ఆసియాకప్ లో అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టోర్నీలో 276 రన్స్ తో టోర్నీలో రెండో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఇక మూడేళ్ల తర్వాత తన తొలి సెంచరీ కూడా చేశాడు. ఆ తర్వాత అదే ఫామ్ ను టీ20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాడు. పాకిస్థాన్ పై అతి గొప్ప ఇన్నింగ్స్ లో ఒకటిగా అభివర్ణించే ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్సే టోర్నీకి హైలైట్. మూడు హాఫ్ సెంచరీలు సహా 296 రన్స్ తో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు" అని ఐసీసీ చెప్పింది.

ఇక టీ20ల్లో 2022లో అత్యధిక రన్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఊహించినట్లే ఈ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. అతడు గతేడాది మొత్తం 1164 రన్స్ చేశాడు. అంతేకాదు టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు.

ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ 2022 ఇదే

జోస్ బట్లర్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికిందర్ రజా, హార్దిక్ పాండ్యా, సామ్ కరన్, వానిందు హసరంగ, హరీస్ రవూఫ్, జోష్ లిటిల్