Ian Chappell On Pant: పంత్ లేని లోటు కనిపిస్తోంది - ఇండియా ఓటమిపై ఛాపెల్ కామెంట్స్
Ian Chappell On Pant: బ్యాటింగ్ పరంగా లోయర్ ఆర్డర్‌లో రిషబ్ పంత్ ఎంత విలువైన ఆటగాడో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు.
Ian Chappell On Pant: రిషబ్ పంత్ లేని లోటు టీమ్ ఇండియాలో స్పష్టంగా కనిపిస్తోందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు. గత ఏడాది డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
పంత్ స్థానంలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో కేఎస్ భరత్‌ను సెలెక్టర్లు ఎంపికచేశారు. మూడు టెస్టులలో స్థానాన్ని దక్కించుకున్న భరత్ బ్యాటింగ్ పరంగా పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 14 యావరేజ్‌తో కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. అతడి పేలవ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు.
మూడో టెస్ట్‌లో ఓటమి తర్వాత టీమ్ ఇండియాలో రిషబ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ కామెంట్స్ చేశాడు. లోయర్ ఆర్డర్‌లో పంత్ లాంటి విలువైన ఆటగాడు ఎంత ముఖ్యమో ఇప్పుడిప్పుడే టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌కు అర్థమవుతోందని చెప్పాడు.
పంత్ ఉండుంటే టీమ్ ఇండియా బ్యాటింగ్ పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు.పంత్ సేవలను ఇండియన్ టీమ్ మిస్సవుతోందని పేర్కొన్నాడు.. ఛాపెల్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్న పంత్ ఇటీవల వాకింగ్ స్టిక్స్ సహాయంతో నడుస్తోన్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఏడాది చివరలో పంత్ టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.