Telugu News  /  Sports  /  Harmanpreet Kaur Hits Century Against England In Second Odi
ఇండియన్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్
ఇండియన్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ (Action Images via Reuters)

Harmanpreet Kaur Century: ఇంగ్లండ్‌పై సెంచరీ బాదిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌.. ఇండియా భారీ స్కోరు

21 September 2022, 22:02 ISTHari Prasad S
21 September 2022, 22:02 IST

Harmanpreet Kaur Century: ఇంగ్లండ్‌పై సెంచరీ బాదింది ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌. దీంతో రెండో వన్డేలో భారీ స్కోరు చేసింది. ఇప్పటికే తొలి వన్డే గెలిచిన ఇండియన్ టీమ్‌.. ఇప్పుడు రెండో వన్డేలోనూ పైచేయి సాధించింది.

Harmanpreet Kaur Century: ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెలరేగిపోయింది. ఇంగ్లండ్‌తో బుధవారం (సెప్టెంబర్‌ 21) జరిగిన రెండో వన్డేలో తన ఐదో సెంచరీ సాధించింది. కేవలం 111 బాల్స్‌లోనే 143 రన్స్ చేయడం విశేషం. ఆమె ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో ఇండియన్‌ టీమ్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 333 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

హర్లీన్‌ డియోల్‌ 58, ఓపెనర్‌ స్మృతి మంధానా 40 రన్స్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో ఒక దశలో 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. తర్వాత హర్మన్‌, హర్లీన్‌ నాలుగో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హర్మన్‌ సెంచరీతో 9 ఏళ్ల కిందటి తన రికార్డునే బ్రేక్‌ చేసింది. ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన ఇండియన్‌ ప్లేయర్‌గా నిలిచింది.

2013లో ఆమె 107 రన్స్‌ చేసి ఈ రికార్డు సృష్టించగా.. ఇప్పుడు 143 రన్స్‌తో అదే రికార్డును మరింత మెరుగుపరచుకుంది. ఈ మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చీరాగానే ఆమె ఇంగ్లండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. రెండు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్‌.. ఇండియా ఇన్నింగ్స్‌నే మార్చేసింది.

ఇక చివరి ఓవర్లలో అయితే ఆమె ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి 3 ఓవర్లలో ఇండియా ఏకంగా 62 రన్స్‌ చేయడం విశేషం. ఆమె ధాటికి ఇంగ్లండ్‌ బౌలర్‌ ఫ్రెయా కెంప్‌ బలైంది. కెంప్‌ తన తొలి 8 ఓవర్లలో 44 రన్స్‌ ఇవ్వగా.. చివరి రెండు ఓవర్లలోనే 45 రన్స్‌ సమర్పించుకుంది. చివరికి ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 333 రన్స్‌ చేసింది. చివర్లో హర్మన్‌కు పూజా (18), దీప్తి (15 నాటౌట్‌) చక్కని సహకారం అందించారు.

మహిళల క్రికెట్‌లో ఇండియాకు ఇంగ్లండ్‌పై వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. 2017 వరల్డ్‌కప్‌లో నమోదు చేసిన 281 రన్స్‌ రికార్డు మరుగునపడిపోయింది. ఇక మహిళల వన్డేల్లో హర్మన్‌ప్రీత్‌ 143 రన్స్‌తో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఇండియన్‌ ప్లేయర్‌గా నిలిచింది. 188 రన్స్‌తో దీప్తి శర్మ పేరిట అత్యధిక స్కోరు రికార్డు ఉంది.