Hardik Pandya on Sanju Samson: ఇది నా టీమ్.. సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై హార్దిక్
Hardik Pandya on Sanju Samson: ఇది నా టీమ్ అంటూ సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై స్టాండిన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 1-0తో గెలిచిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
Hardik Pandya on Sanju Samson: న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను 1-0తో ఇండియా గెలిచింది. కానీ ఈ విజయంలోనూ టీమ్ ఎంపికపై ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. ఆడే అవకాశం వచ్చిన రెండు మ్యాచ్‌లలోనూ సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు అవకాశం దక్కకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మూడో టీ20 డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా ముగిసి సిరీస్‌ను 1-0తో ఇండియా గెలిచిన తర్వాత ఇండియన్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా వాళ్లను ఎందుకు ఆడించలేదని అతన్ని ప్రశ్నించారు. దీనికి హార్దిక్ స్పందిస్తూ.. ఇది తన టీమ్ అని, తమకు ఏది మంచి టీమ్ అనిపిస్తే దానిని ఎంపిక చేస్తామని చెప్పడం గమనార్హం.
"ముందుగా చెప్పాలంటే బయటి వాళ్లు ఏమనుకుంటున్నారన్న దానితో మాకు సంబంధం లేదు. ఇది నా టీమ్. కోచ్‌తో మాట్లాడి ఈ టీమ్ బాగుంటుంది, మాకు ఏ టీమ్ అవసరమో దానిని తీసుకుంటాం. ఇంకా చాలా సమయం ఉంది. అందరికీ అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు సుదీర్ఘకాలం అవకాశం దక్కుతుంది. ఒకవేళ సిరీస్ పెద్దదిగా ఉండి, మ్యాచ్‌లు ఎక్కువుంటే ఎక్కువ మంది అవకాశాలు వచ్చేవి. ఇది చిన్న సిరీస్. నేను మార్పులు, చేర్పులను పెద్దగా ఇష్టపడను. ఇక వయసును కూడా పట్టించుకోను" అని హార్దిక్ స్పష్టం చేశాడు.
మూడో టీ20లో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి డక్‌వర్త్ లూయిస్ స్కోరును ఇండియా సమం చేయడంతో మ్యాచ్ టైగా ముగిసి సిరీస్‌ను ఇండియా 1-0తో గెలిచిన విషయం తెలిసిందే. ఇక తమ టీమ్‌ను డిఫెండ్ చేసుకోవడానికి దీపక్ హుడా ఎంపికను ఉదాహరణగా చెప్పాడు. "నాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ అవసరమైన సమయంలో దీపక్ హుడా ఆ పని సరిగ్గా చేశాడు. బ్యాటర్లు ఇలా బౌలింగ్ చేస్తుంటే మెల్లగా ప్రత్యర్థి బ్యాటర్లు ఆశ్చర్యపరిచేలా చాలా బౌలింగ్ ఆప్షన్లు మన దగ్గర ఉంటాయి" అని హార్దిక్ అన్నాడు.
టీ20 సిరీస్ ముగియడంతో హార్దిక్ పాండ్యా ఇక ఇంటికి వచ్చేయనున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ శుక్రవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానుంది.