Hardik Pandya Controversy: పాండ్యా ఔట్‌పై తీవ్ర దుమారం.. ఇది ఎలా ఔట్ అంటూ ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్
Hardik Pandya Controversy: పాండ్యా ఔట్‌పై తీవ్ర దుమారం రేగింది. అతనిది ఎలా ఔట్ అంటూ ట్విటర్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.
Hardik Pandya Controversy: న్యూజిలాండ్ తో హైదరాబాద్ లో జరుగుతున్న తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ అభిమానులను ఉర్రూతలూగించింది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన గిల్.. కేవలం 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు.
అయితే ఇదే మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఔటైన విధానం కూడా తీవ్ర దుమారం రేపింది. అతన్ని థర్డ్ అంపైర్ ఔటిచ్చిన తీరుపై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు పాండ్యా బౌల్డ్ కాదని రీప్లేల్లో స్పష్టంగా కనిపిస్తున్నా.. అతన్ని ఔట్ గా ప్రకటించారు. దీనిపై ట్విటర్ వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
28 రన్స్ చేసి పెద్ద స్కోరుపై కన్నేసిన పాండ్యా.. మిచెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. బంతిని పాండ్యా కట్ చేయడానికి వెళ్లగా అది మిస్ అయింది. అది నేరుగా వెళ్లి వికెట్ కీపర్ టామ్ లేథమ్ చేతుల్లో పడింది. ఈ క్రమంలో స్టంప్స్ పై ఉన్న బెయిల్స్ కదిలాయి. న్యూజిలాండ్ ప్లేయర్స్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశారు.
చాలాసేపు రీప్లేలను పరిశీలించిన తర్వాత థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. అది చూసి పాండ్యా సహా కామెంటేటర్లు షాక్ తిన్నారు. బాల్ అసలు స్టంప్స్ కు తగిలినట్లు రీప్లేల్లో తేలలేదు. లేథమ్ గ్లవ్స్ తగిలి బెయిల్స్ కదిలినట్లుగా అనిపించింది. అయినా పాండ్యాను ఔటివ్వడం ఎవరికీ మింగుడు పడటం లేదు. ఇది ఎలా ఔట్ అంటూ అప్పటి నుంచీ ఆ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అటు పాండ్యా కూడా తనను ఔటివ్వడంపై అసహనం వ్యక్తం చేశాడు. అతడు 38 బంతుల్లో 28 రన్స్ చేశాడు.
సంబంధిత కథనం