Hardik Pandya Captaincy: వన్డే కెప్టెన్సీ కూడా హార్దిక్ పాండ్యా చేతికి.. ఎప్పుడంటే?
Hardik Pandya Captaincy: వన్డే కెప్టెన్సీ కూడా హార్దిక్ పాండ్యా చేతికి చిక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ బీసీసీఐ అధికారి కామెంట్స్ చూస్తుంటే.. రోహిత్ తర్వాత పాండ్యాకే వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ కూడా దక్కనుంది.
Hardik Pandya Captaincy: ఇండియన్ టీమ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గతేడాది ఐపీఎల్లో తన కెప్టెన్సీ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టీమిండియాను లీడ్ చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు టీ20ల్లో పూర్తిస్థాయి కెప్టెన్సీ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఫార్మాట్ నుంచి తరచూ రోహిత్, విరాట్ కోహ్లిలకు బీసీసీఐ విశ్రాంతినిస్తుండటంతో 2024 టీ20 వరల్డ్ కప్ కు పాండ్యా కెప్టెన్సీలోనే ఇండియన్ టీమ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఇప్పుడు వన్డే టీమ్ కెప్టెన్సీ కూడా హార్దిక్ పాండ్యాకు దక్కే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ నెక్ట్స్ వెబ్ సైట్ వెల్లడించింది. 2023 వరల్డ్ కప్ తర్వాత వన్డేల నుంచి లేదంటే కెప్టెన్సీ నుంచి రోహిత్ తప్పుకునే అవకాశం ఉందని, అతని స్థానంలో కెప్టెన్ అయ్యే అవకాశాలు పాండ్యాకే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఓ బీసీసీఐ అధికారి ఈ విషయం చెప్పినట్లుగా వెల్లడించింది.
"ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ ను రోహితే నడిపిస్తాడు. కానీ ఆ తర్వాత ఏంటన్నది ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే చూసుకుందామంటే కుదరదు. 2023 వరల్డ్ కప్ తర్వాత ఒకవేళ రోహిత్ వన్డే ఫార్మాట్ నుంచి లేదంటే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మా దగ్గర ఒక ప్లాన్ ఉండాలి" అని సీనియర్ బీసీసీఐ అధికారి చెప్పినట్లు క్రికెట్ నెక్ట్స్ తన కథనంలో రాసింది.
అయితే రోహిత్ తర్వాత హార్దిక్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా ఆ అధికారి స్పష్టం చేశారు. "కెప్టెన్ గా హార్దిక్ విజయవంతమవుతున్నాడు. అతడు యువకుడు. రానున్న రోజుల్లో ఇంకా మెరగవుతాడు. ప్రస్తుతానికి అతని కంటే మంచి ఆప్షన్ అయితే కనిపించడం లేదు. పాండ్యాకు ఎక్కువ కాలం పాటు మద్దతు ఇవ్వాలి" అని ఆ అధికారి చెప్పారు.
టీ20ల్లో పాండ్యా 8 మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉండగా.. ఇండియా ఒక్కదాంట్లో మాత్రమే ఓడిపోయింది. దీంతో అతని కెప్టెన్సీ బోర్డునే కాదు.. మాజీ క్రికెటర్లను, అభిమానులను కూడా బాగా ఆకర్షించింది. దీంతో ఈ మధ్య కాలంలో టీ20 ఫార్మాట్ నుంచి రోహిత్ కు విశ్రాంతినిస్తూ హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తున్నారు. రోహిత్ కు వారసుడు సిద్ధంగా ఉండటంతో వైట్ బాల్ క్రికెట్ లో అయినా కెప్టెన్సీ మార్పు సజావుగా జరగాలని బోర్డు భావిస్తోంది.