Harbhajan Praises Kohli: కోహ్లీ 75 సెంచరీలు చేశాడు.. ఇంకో 50 చేయగలడు.. హర్భజన్ జోస్యం-harbhajan singh says virat kohli can reach sachin 100 ton record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Harbhajan Singh Says Virat Kohli Can Reach Sachin 100 Ton Record

Harbhajan Praises Kohli: కోహ్లీ 75 సెంచరీలు చేశాడు.. ఇంకో 50 చేయగలడు.. హర్భజన్ జోస్యం

Maragani Govardhan HT Telugu
Mar 13, 2023 09:19 AM IST

Harbhajan Praises Kohli: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడని జోస్యం చెప్పాడు. ఇప్పటికే 75 శతకాలు చేశాడని, ఇంకో 50 చేయగలడని చెప్పాడు.

సచిన్-కోహ్లీ
సచిన్-కోహ్లీ (File/PTI)

Harbhajan Praises Kohli: టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టెస్టుల్లో శతకాన్ని నమోదు చేశాడు. అహ్మాదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ దీర్ఘకాల ఫార్మాట్‌లో 28వ శతకాన్ని నమోదు చేశాడు. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 571 పరుగులు చేసింది ఆసీస్‌పై 91 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. విరాట్ కోహ్లీకి ఇది 75వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. సచిన్ తర్వాత అత్యధిక శతకాలను బాదిన రెండో క్రికెటర్‌గా ఉన్నాడు. అయితే 34 ఏళ్ల విరాట్.. సచిన్ 100 సెంచరీల రికార్డును అధిగమిస్తాడని సర్వత్రా భావిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ హర్భజన్ సింగ్ కూడా తన స్పందనను తెలియజేశాడు.

ట్రెండింగ్ వార్తలు

"సచిన్ రికార్డును అధిగమించడం కోహ్లీకి సాధ్యమవుతుంది. నాకు తెలిసి విరాట్ కోహ్లీ అంతకంటే(100 సెంచరీలు) ఎక్కువే నమోదు చేయొచ్చు. కోహ్లీకి సంబంధించి ఇక్కడ రెండు విషయాలను గమనించాలి. అతడి వయస్సు, ఫిట్నెస్. కోహ్లీ వయస్సు ప్రస్తుతం 34 ఏళ్లు. కానీ ఫిట్నెస్ పరంగా అతడు 24 ఏళ్ల క్రికెటర్ వలే ఆడుతున్నాడు. ఈ విషయంలో చాలా ముందున్నాడు. ఇప్పటికే విరాట్ 75 సెంచరీలు చేశాడు. నాకు తెలిసి మరో 50 సెంచరీలు చేయగలడు. అతడి గేమ్ గురించి అతడికి మంచి క్లారిటీ ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ ఆడగలడు." అని హర్భజన్ సింగ్ తెలిపాడు.

"కోహ్లీ గురించి నేను ఎక్కువ చెబుతున్నానని మీరనుకోవచ్చు. కానీ ఇది కచ్చితంగా సాధ్యమవుతుంది. అది ఎవరైనా చేయగలరా అంటే కోహ్లీనే. మిగిలిన వారంతా అతడికి చాలా దూరంలో ఉన్నారు. తన ఫిట్‌నెస్‌పై వర్క్ చేయాలని అతడికి తెలుసు. అతడు ఇక్కడితో ఆగడు. సాంకేతిక లోపాలు లేవని నేను అనను. ఒకవేళ ఉన్నా వాటిపై వర్కౌట్ చేస్తాడు. ఫామ్ పుంజుకున్నప్పటి నుంచి కోహ్లీ ఇప్పటికి ఐదు సెంచరీలు చేశాడు. ఇది అతడికి చక్కటి పునరాగమనం" అని భజ్జీ చెప్పాడు.

విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 75 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. అయితే టెస్టుల్లో 2019 తర్వాత సెంచరీ చేయడం ఇదే తొలిసారి. మూడేళ్ల నిరీక్షణ తర్వాత శతకం నమోదు చేసిన విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సెంచరీలు చేశాడు కోహ్లీ.

WhatsApp channel