Telugu News  /  Sports  /  Gavaskar On World Cup Says Do Not Go With Foreign Commentators For Team Selection
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ (Getty/PTI)

Gavaskar on World Cup: విదేశీ కామెంటేటర్లు చెప్పిన ప్లేయర్స్‌ను తీసుకుంటే వరల్డ్ కప్ గెలవలేం: గవాస్కర్

23 January 2023, 14:50 ISTHari Prasad S
23 January 2023, 14:50 IST

Gavaskar on World Cup: విదేశీ కామెంటేటర్లు చెప్పిన ప్లేయర్స్‌ను తీసుకుంటే వరల్డ్ కప్ గెలవలేమని అన్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఈ సందర్భంగా 2019 వరల్డ్ కప్ కోసం టీమ్ ఎంపికలో జరిగిన తప్పిదాన్ని గుర్తు చేశాడు.

Gavaskar on World Cup: ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ గురించి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత అభిమానులందరూ 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ గెలవాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు? వంటి విషయాలను వివరించాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. ఇప్పటి వరకూ మళ్లీ ట్రోఫీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది.

ట్రెండింగ్ వార్తలు

2019 వరల్డ్ కప్ లో సెమీస్ వరకూ వచ్చి ఓడిపోయింది. అయితే ఆ వరల్డ్ కప్ లో టీమ్ ఎంపిక విషయంలో జరిగిన తప్పిదమే ఈ ఓటమికి కారణమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పాడు. మిడ్ డేకు రాసిన తన తాజా కాలమ్ లో సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విదేశీ కామెంటేటర్లు చెప్పిన వ్యక్తిని తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని అతడు అనడం గమనార్హం.

"ఇండియన్ టీమ్ లో ఎవరు ఉండాలని అడుగుతూ మన మీడియా విదేశీ కామెంటేటర్ల దగ్గరికి వెళ్లదని ఆశిస్తున్నా. ఈ కామెంటేటర్లు తమ దేశానికి విధేయులుగా ఉంటారన్న విషయం మరచిపోవద్దు. వీళ్లు ఇండియాకు అవసరం లేని ప్లేయర్స్ పేర్లను సూచించవచ్చు. గత వరల్డ్ కప్ లో ఏం జరిగిందో చూశాం. ఐపీఎల్లో బాగా ఆడాడని విదేశీ కామెంటేటర్లు చెప్పడంతో ఓ కొత్త ప్లేయర్ ను తీసుకున్నారు. దీంతో అప్పటికే తనను తాను నిరూపించుకున్న ప్లేయర్ ను తప్పించారు. కానీ ఆ ఆటగాన్ని తుది జట్టులో పెద్దగా ఆడించనే లేదు" అని గవాస్కర్ చెప్పాడు.

ఆ ప్లేయర్ ఎవరు అన్నది సన్నీ నేరుగా చెప్పలేదు. అయితే అతడు చెప్పినదాని ప్రకారం చూస్తే.. ఆ కొత్త ప్లేయర్ విజయ్ శంకర్ కాగా.. తనను తాను నిరూపించుకున్న ప్లేయర్ అంబటి రాయుడు. ఏడాది ముందు నుంచే నాలుగోస్థానానికి తాను సరిగ్గా సరిపోతానని రాయుడు నిరూపించుకున్నాడు. కానీ వరల్డ్ కప్ సమయానికి విదేశీ కామెంటేటర్లు చెప్పిన విజయ్ శంకర్ ను తీసుకున్నారు.

అతడు అంతకుముందు ఐపీఎల్లో 244 రన్స్ చేయడంతోపాటు ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ వరల్డ్ కప్ లో మాత్రం కేవలం మూడు మ్యాచ్ లే ఆడి 58 రన్స్ చేసి, రెండు వికెట్లు తీశాడు. తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. దీని కారణంగా టీమిండియా తుదిజట్టులో కచ్చితంగా ఉండే రాయుడులాంటి ఓ ప్లేయర్ సేవలను కోల్పోయింది. ఇదే విషయాన్ని ఇప్పుడు గవాస్కర్ గుర్తు చేశాడు.

"క్రికెట్ కు చాలా ఆదరణ ఉంది. ఎప్పుడో ఓ క్రికెట్ వార్త ఉండాలని అనుకోవడం తప్పులేదు. కానీ దాని కోసం విదేశీ కామెంటేటర్ల దగ్గకు వెళ్లకపోతే బాగుంటుంది. మన టీమ్ లో ఎవరికి తీసుకోవాలో వాళ్లను అడగటం సరి కాదు. అలా చేస్తే మనం, మన అభిమానులు నవ్వులపాలవుతారు. ఇది ఏమాత్రం మంచిది కాదు" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.