Gavaskar on Rohit, Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఇక టీ20ల్లో చూడలేమా? వాళ్లిద్దరినీ బీసీసీఐ పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనా? ఇప్పుడు అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత సీనియర్లను పక్కన పెట్టి యువకులకు అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకు తగినట్లే బీసీసీఐ కూడా టీ20లకు రోహిత్, కోహ్లిలను పక్కన పెట్టి యువకులను తీసుకుంటోంది.,అయితే ఇక వీళ్లిద్దరినీ అసలు టీ20లకు పరిశీలించరా అన్న ప్రశ్నకు మాత్రం బీసీసీఐ స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. కానీ మాజీ క్రికెటర్ గవాస్కర్ మాత్రం ఈ ఇద్దరి టీ20 భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫార్మాట్‌లో వీళ్ల కెరీర్ ముగిసినట్లే అని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. గతేడాది న్యూజిలాండ్ టూర్, ఈ ఏడాది మొదట శ్రీలంక, తర్వాత న్యూజిలాండ్‌తో టీ20ల సిరీస్‌లకు వీళ్లను పక్కన పెట్టడంతో అభిమానులు మాత్రం ఇక వీళ్ల టీ20 కెరీర్ ముగిసినట్లే అన్న భావనలో ఉన్నారు.,ఈ నేపథ్యంలో ఇండియా టుడేతో మాట్లాడిన గవాస్కర్.. వీళ్ల టీ20 భవిష్యత్తుపై స్పష్టమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. "నేను ఈ విషయాన్ని ఎలా చూస్తానంటే.. టీ20 వరల్డ్‌కప్ వచ్చే ఏడాది అంటే 2024లో ఉంది. సెలక్షన్ కమిటీ యువకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. అంతమాత్రాన వాళ్లు ఇక రోహిత్, కోహ్లిల పేర్లను పరిశీలించరు అని చెప్పలేం. ,2023 మొత్తం ఈ ఇద్దరు ప్లేయర్స్ బాగా ఆడితే వాళ్లు టీమ్‌లో ఉండాల్సిందే. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రానున్న ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఇండియాకు కీలకం. ఆ సిరీస్‌కు ఈ ఇద్దరు తాజాగా బరిలోకి దిగాలన్న ఉద్దేశంతో కూడా సెలక్టర్లు వీళ్లను న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పక్కన పెట్టి ఉంటారు" అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.,అయితే సన్నీ అభిప్రాయం ఎలా ఉన్నా.. ఈ ఏడాది ఇండియా మరో రెండు టీ20 సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. జులై/ఆగస్ట్‌లలో వెస్టిండీస్‌తో ఒకటి, వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత మరొకటి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ ఇక టీ20ల్లో ఉండటం అనుమానమే. పైగా వచ్చే ఏడాది వరల్డ్‌కప్ నాటికి వీళ్ల వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. అప్పటికి రోహిత్ 37, కోహ్లి 36వ పడిలో ఉంటారు. సెలక్టర్లు ఈ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటారనడంలో సందేహం లేదు.,