Gavaskar on Bumrah Replacement: బుమ్రా స్థానంలో ఎవరు.. గవాస్కర్‌ సలహా ఇదీ-gavaskar on bumrah replacement says void left by him is nearly impossible to fill ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gavaskar On Bumrah Replacement Says Void Left By Him Is Nearly Impossible To Fill

Gavaskar on Bumrah Replacement: బుమ్రా స్థానంలో ఎవరు.. గవాస్కర్‌ సలహా ఇదీ

Hari Prasad S HT Telugu
Oct 04, 2022 08:06 AM IST

Gavaskar on Bumrah Replacement: బుమ్రా స్థానంలో ఎవరు వరల్డ్‌కప్‌ టీమ్‌లో ఆడాలన్న చర్చ ఇప్పుడు మొదలైంది. దీనిపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ స్పందించాడు.

సునీల్ గవాస్కర్, బుమ్రా
సునీల్ గవాస్కర్, బుమ్రా (PTI/Getty)

Gavaskar on Bumrah Replacement: ఎప్పుడో 2007లో తొలిసారి జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో గెలిచిన టీమిండియా.. ఇప్పటి వరకూ మళ్లీ ట్రోఫీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఇండియన్‌ టీమ్‌ చాలా బలంగా ఉంది.. టీమ్‌కు గెలిచే అవకాశాలు ఉన్నాయన్న అంచనాల మధ్య సరిగ్గా టోర్నీకి కొన్ని రోజుల ముందు స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరం కావడం షాక్‌కు గురి చేసింది.

ట్రెండింగ్ వార్తలు

వెన్ను గాయం కారణంగా బుమ్రా వరల్డ్‌కప్‌లో ఆడబోవడం లేదని బీసీసీఐ స్పష్టం చేయడంతో ఇక అతని స్థానంలో ఎవరు అన్న చర్చ మొదలైంది. బుమ్రా రీప్లేస్‌మెంట్‌ను త్వరలోనే బోర్డు ప్రకటించనుంది. నిజానికి బుమ్రాలాంటి బౌలర్‌ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువైన విషయం కాదు. స్టాండ్‌బై లిస్ట్‌లో ఉన్న షమికే ఎక్కువ అవకాశం ఉందన్నది క్రికెట్‌ పండితుల మాట. కానీ అతనికి మరో స్టాండ్‌బై ప్లేయర్‌ దీపక్‌ చహర్‌, ఈ మధ్యే సౌతాఫ్రికా సిరీస్‌లో బుమ్రా స్థానంలో వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ను పోటీ ఉంది.

బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం

అయితే తాజాగా మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ కూడా బుమ్రా లేని లోటుపై స్పందించాడు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యమని సన్నీ అనడం గమనార్హం. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌తోపాటు అర్ష్‌దీప్‌, హర్షల్‌ పటేల్‌లాంటి వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్న వేళ బుమ్రా కూడా లేకపోవడం టీమిండియాకు దెబ్బే. ఈ మధ్య ఒకసారి ఆస్ట్రేలియా 208 రన్స్‌ టార్గెట్‌ను నిలబెట్టుకోలేకపోయింది. ఇక సౌతాఫ్రికా కూడా 238 టార్గెట్‌ను చేజ్‌ చేసినంత పని చేసింది. డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసే సత్తా బుమ్రా ఒక్కడికే ఉందన్నది నిపుణుల మాట.

"వరల్డ్‌కప్‌ టీమ్‌లో బుమ్రా లేకపోవడం ఇండియాను చాలా దెబ్బతీస్తుంది. ఇతర ప్లేయర్స్‌ అందరిపై గౌరవంతోనే ఈ మాట చెబుతున్నాను.. బుమ్రా లేని లోటు ఇతర ఏ ప్లేయర్‌ లేకపోవడం కంటే కూడా ఎక్కువ" అని గవాస్కర్‌ అనడం విశేషం. "అతడు ఆడిన రెండు మ్యాచ్‌లను మనం చూశాం. టీమ్‌లో అతడు ఉండటం ఇతర బౌలర్ల ప్రదర్శనను కూడా మెరుగుపరచింది.

అతడు తొందరపడి టీమ్‌లోకి వచ్చాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే టీ20 వరల్డ్‌కప్‌కు బుమ్రా లేకపోవడం మాత్రం ఇండియా అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తిరువనంతపురంలో దీపక్‌ చహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం కాస్త ఆశలు రేపుతోంది. కాస్త అదృష్టం కలిసి వస్తే వాళ్లు బుమ్రా లేని లోటును తీర్చగలరు" అని గవాస్కర్‌ మిడ్‌డేకు రాసిన కాలమ్‌లో అభిప్రాయపడ్డాడు.

ఇక ఆల్‌రౌండర్‌ జడేజా లేని లోటును అక్షర్‌ పటేల్‌ చాలా వరకూ తీరుస్తున్నాడని కూడా గవాస్కర్‌ చెప్పాడు. పరుగులు కట్టడి చేయడంతోపాటు వికెట్లు కూడా తీయగలనని తన బౌలింగ్‌తో అక్షర్‌ చాటిచెబుతున్నాడని సన్నీ అన్నాడు. ఐపీఎల్‌లో గడించిన అనుభవాన్ని అతడు ఇప్పుడు సరిగ్గా ఉపయోగించుకుంటున్నాడని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

WhatsApp channel