Gavaskar on Ashwin: చెత్త ఫీల్డింగ్ కాదు.. అశ్విన్ వల్లే ఓడిపోయాం: గవాస్కర్-gavaskar on ashwin says he is the main reason behind the loss against south africa ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gavaskar On Ashwin Says He Is The Main Reason Behind The Loss Against South Africa

Gavaskar on Ashwin: చెత్త ఫీల్డింగ్ కాదు.. అశ్విన్ వల్లే ఓడిపోయాం: గవాస్కర్

Hari Prasad S HT Telugu
Nov 01, 2022 09:32 PM IST

Gavaskar on Ashwin: చెత్త ఫీల్డింగ్ వల్ల కాదు.. అశ్విన్ వల్లే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడిపోయామని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న టీమిండియా.. సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

అశ్విన్ పై పరోక్షంగా పంచ్ వేసిన సునీల్ గవాస్కర్
అశ్విన్ పై పరోక్షంగా పంచ్ వేసిన సునీల్ గవాస్కర్ (PTI-AP)

Gavaskar on Ashwin: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇండియన్‌ టీమ్‌ ఓడిపోవడానికి చాలా మంది చెప్పిన కారణంగా చెత్త ఫీల్డింగ్‌. కీలకమైన సమయంలో క్యాచ్‌లు డ్రాప్‌ చేసి మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. అయితే బ్యాటింగ్‌ లెజెండ్‌ సునీల్‌ గవాస్కర్‌ వాదన మాత్రం మరోలా ఉంది. అతడు ఈ ఓటమికి అశ్విన్‌ పేరును నేరుగా చెప్పకపోయినా అతనే కారణమని అనడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌లో 5 వికెట్లతో గెలిచిన సఫారీలు గ్రూప్‌ 2లో టాప్‌లోకి దూసుకెళ్లారు. విరాట్ కోహ్లి క్యాచ్ డ్రాప్‌ చేయడం, కేఎల్‌ రాహుల్‌ చెత్త ఫామ్‌ కొనసాగడం ఈ మ్యాచ్‌లో టీమిండియా కొంప ముంచింది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఇండియా సెమీస్‌ బెర్త్‌ ఖరారయ్యేది. కానీ ఇప్పుడు ఈ ఓటమితో ఇప్పుడు మిగిలిపోయిన రెండు మ్యాచ్‌లలోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ మ్యాచ్‌లో ఓటమికి ఫీల్డింగ్ తప్పిదాల కంటే ఓ బౌలర్‌ 43 రన్స్‌ ఇవ్వడమే కారణమని పరోక్షంగా అశ్విన్‌ను టార్గెట్‌ చేశాడు గవాస్కర్‌. "క్రికెట్‌లో క్యాచ్ డ్రాప్‌ చేయడం, రనౌట్‌ మిస్‌ కావడంలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ ఓటమికి ఒక ప్లేయర్‌ను నిందించడం సరి కాదు. అదృష్టం కలిసి రానప్పుడు పెద్ద ప్లేయర్స్‌ కూడా క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం, రనౌట్‌ మిస్‌ చేయడం చేస్తుంటారు. ఇండియన్‌ టీమ్‌లో ఒక బౌలర్‌ 43 రన్స్‌ సమర్పించుకోవడం ప్రధాన సమస్య అని నేను నమ్ముతున్నాను" అని సన్నీ అన్నాడు.

ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ 4 ఓవర్లు వేసి 43 రన్స్ ఇచ్చాడు. అతడు ఒకే వికెట్‌ తీసుకున్నాడు. అయితే మ్యాచ్‌ 18వ ఓవర్లో 13 రన్స్‌ ఇవ్వడంతో మ్యాచ్‌ సౌతాఫ్రికా వైపు మొగ్గింది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే యుజువేంద్ర చహల్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని, దాని వల్ల తర్వాతి మ్యాచ్‌లకు అతడు సిద్ధంగా ఉండేవాడని గవాస్కర్‌ అన్నాడు.

WhatsApp channel