Kaneria Blamed Rohit: సూర్యకుమార్ డకౌట్ కావడంలో రోహిత్‌దే తప్పు.. హిట్‌మ్యాన్‌ను నిందించిన పాక్ మాజీ
Kaneria Blamed Rohit: టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ ఇటీవలే జరిగిన వన్డే సిరీస్‌లో మూడు సార్లు గోల్డెన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పూర్తి బాధ్యతే రోహిత్ శర్మదేనని పాక్ మాజీ ప్లేయర్ డానిష్ కనేరియా అన్నాడు.
Kaneria Blamed Rohit: టీ20 క్రికెట్‌లో వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వన్డేలకు సూర్యకుమార్ పనికిరాడని, వెంటనే అతడి స్థానంలో మరొకరి చోటు కల్పించాలని పెద్ద చర్చే జరిగింది. టెస్టుల్లోనూ అతడు సెట్ కాలేడని క్రికెట్ నిపుణులు వాదిస్తున్నారు. ఈ విధంగా వరుసగా అతడిపై విమర్శలు వస్తుంటే.. పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా మాత్రం విరుద్ధంగా స్పందించాడు. సూర్యకుమార్ వన్డేల్లో ఇబ్బంది పడటానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ, జట్టు మేనేజ్మెంటేనని స్పష్టం చేశాడు.
"వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ గోల్డెన్ డక్ అవడం అతడి తప్పు కాదు. ఇందుకు పూర్తి బాధ్యత కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు మేనేజ్మెంట్‌లదే. అతడిని డౌన్ ఆర్డర్‌లో దించి ఆత్మవిశ్వాసాన్ని తగ్గేలా చేశారు. సూర్యాను బ్యాటింగ్‌కు ముందుగా పంపించాల్సింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తర్వాత అతడు బ్యాటింగ్ చేస్తే బాగుండేది. అలా కాకుండా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యను పంపించి వారి తర్వాత అతడికి అవకాశమిచ్చారు." అని డానిష్ కనేరియా అన్నాడు.
పొట్టి ఫార్మాట్‌లో టాప్ ప్లేయర్‌గా ఉన్న సూర్యకుమార్.. 50 ఓవర్ల గేమ్‌లో మాత్రం తేలిపోయాడు. మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆష్టన్ ఆగర్ వేసిన 36వ ఓవర్లో అతడు తను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో, విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ ఎల్బీడబ్ల్యూ ట్రాప్‌లో సూర్యకుమార్ ఇరుక్కోగా.. మూడో వన్డేలో మాత్రం ఆష్టన్ అగర్ స్పిన్ మాయాజలానికి పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ 1-2 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ సమర్పించుకోవాల్సి వచ్చింది. కీలక భాగస్వామ్యాలను నిర్మించడంలో విఫలమైన భారత ఆటగాళ్లు చివరకు ఓటమిని చవిచూశారు.