Equal Match Fees for Cricketers: మెన్, వుమెన్ క్రికెటర్లకు ఒకే మ్యాచ్ ఫీజు.. బీసీసీఐ కీలక నిర్ణయం
Equal Match Fees for Cricketers: మెన్, వుమెన్ క్రికెటర్లకు ఒకే మ్యాచ్ ఫీజ్ ఇవ్వాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. లింగ వివక్షకు తెరదించే దిశగా ఇది తొలి నిర్ణయమని ఈ సందర్భంగా బోర్డు సెక్రటరీ జై షా చెప్పారు.
Equal Match Fees for Cricketers: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పురుష, మహిళా క్రికెటర్లకు సమానమైన మ్యాచ్ ఫీజు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బోర్డ కార్యదర్శి జై షా వెల్లడించారు. ఒక విధంగా ఇండియన్ క్రికెట్‌లో లింగ వివక్షకు తెరదించే విప్లవాత్మక నిర్ణయంగా చెప్పొచ్చు.
బీసీసీఐ కాంట్రాక్ట్ పొందిన మహిళా క్రికెటర్లు ఇక నుంచి ఇండియన్ మెన్స్ టీమ్ సభ్యులు పొందే స్థాయిలోనే మ్యాచ్ ఫీజు అందుకోనున్నట్లు జై షా చెప్పారు. గురువారం (అక్టోబర్ 27) ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఆయన తెలిపారు. "వివక్షకు తెరదించే దిశగా బీసీసీఐ తొలి అడుగు వేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న మహిళా క్రికెటర్లకు సమానమైన వేతన విధానం అమలు చేయబోతున్నాం. క్రికెట్‌లో లింగ సమానత్వం దిశగా అడుగు వేస్తూ పురుష, మహిళా క్రికెటర్లు ఒకే రకమైన మ్యాచ్ ఫీజు అందుకునేలా చేస్తున్నాం" అని జై షా చెప్పారు.
మరో ట్వీట్‌లో ఇక నుంచి మహిళా క్రికెటర్లు ఎంత మ్యాచ్ ఫీజు అందుకోబోతున్నారో వెల్లడించారు. "బీసీసీఐ వుమెన్ క్రికెటర్లు ఇక నుంచి మెన్ క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు అందుకుంటారు. అంటే ఒక టెస్ట్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు ఇస్తాము. మన మహిళా క్రికెటర్లకు సమానమైన వేతనం అన్నది నేను వాళ్లకు ఇచ్చిన కమిట్‌మెంట్. దీనికి మద్దతిచ్చిన అపెక్స్ కమిటీకి కృతజ్ఞతలు" అని జై షా ట్వీట్ చేశారు.
వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ కూడా ప్రారంభించాలని ఈ మధ్యే బీసీసీఐ ఏజీఎం నిర్ణయించిన కొన్ని రోజుల్లోనే ఈ ఒకే మ్యాచ్ ఫీజు నిర్ణయం కూడా వెలువడింది. ఈ మధ్యకాలంలో మహిళల క్రికెట్‌కు కూడా ఆదరణ పెరుగుతోంది. 2017 వరల్డ్‌కప్‌లో ఇండియన్ టీమ్ రన్నరప్‌గా నిలిచిన తర్వాత మహిళల క్రికెట్‌ను చూస్తున్న వారి సంఖ్య పెరిగింది.
ఇక ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఇండియన్ టీమ్ సిల్వర్ మెడల్ గెలిచింది. ఈమధ్యే న్యూజిలాండ్ క్రికెట్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ టీమ్ మహిళా, పురుష క్రికెటర్లు కూడా ఒకే రకమైన మ్యాచ్ ఫీజు అందుకుంటున్నారు.