ENG vs IRE: బ్రాడ్‍మన్ 93ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్-england batsman ben duckett broke don bradman 93 year old record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  England Batsman Ben Duckett Broke Don Bradman 93 Year Old Record

ENG vs IRE: బ్రాడ్‍మన్ 93ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 03, 2023 02:11 PM IST

ENG vs IRE: ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‍లో ఓ రికార్డు బద్దలైంది. 93 సంవత్సరాలుగా గ్రేట్ డాన్ బ్రాడ్‍మన్ పేరుతో ఉన్న రికార్డును ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బద్దలుకొట్టాడు.

బెన్ డకెట్
బెన్ డకెట్ (AP)

ENG vs IRE: లండన్‍లోని క్రికెట్ మక్కా ‘లార్డ్స్ మైదానం’ వేదికగా జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్ జట్టు.. ఐర్లాండ్‍పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఏకంగా 82.4 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి 524 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఓలీ పోప్ 205 పరుగులు (208 బంతులు), బెన్ డకెట్ కేవలం 178 బంతుల్లో 182 పరుగులు చేశారు. అయితే ఈ క్రమంలో సర్ డాన్ బ్రాడ్‍మన్ పేరిట ఉన్న 93ఏళ్ల నాటి రికార్డును డకెట్ బద్దలుకొట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

లార్డ్స్ మైదానంలో టెస్టులో అత్యంత వేగంగా 150 పరుగులు స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‍గా డాన్ బ్రాడ్‍మన్‍ను బెన్ డకెట్ అధిగమించాడు. డాన్ పేరిట ఉన్న 93 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. 150 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు డకెట్. బ్రాడ్‍మన్ 1930లో లార్డ్స్ గ్రౌండ్‍లో 166 బంతుల్లో ఈ మార్కును చేరాడు. అలాగే, లార్డ్స్ మైదానంలో లంచ్ కంటే ముందే టెస్టు సెంచరీ చేసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు డకెట్. ఆ మైదానంలో 1924 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ఐర్లాండ్‍తో జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‍ను 172 పరుగులకే కుప్పకూల్చింది ఇంగ్లండ్. స్టువర్ట్ బ్రాడ్ 5 వికెట్లు, జాక్ లీక్ 3, మాథ్యు పాట్స్ 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో 82.4 ఓవర్లకే నాలుగు వికెట్లకు 524 పరుగులు చేసి డిక్లేర్ చేసింది ఇంగ్లండ్. రెండో రోజు ముగిసే సరికి ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఇంకా ఐరిష్ టీమ్ 255 పరుగులు వెనుకబడి ఉంది.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆడగా.. ముగ్గురి స్ట్రైక్ రేట్ వందపైనే ఉంది. పోప్ (98.55 స్ట్రయిక్ రేట్), జో రూట్ (94.91) స్ట్రయిక్ రేట్ కూడా 100కు సమీపంలోనే ఉంది. మొత్తంగా ఈ టెస్టును ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వన్డేలా ఆడేశారు. ఐర్లాండ్ జట్టుకు చుక్కలు చూపుతున్నారు.

WhatsApp channel