Dravid on Virat Kohli: కోహ్లి సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పిన కోచ్ రాహుల్ ద్రవిడ్
Dravid on Virat Kohli: కోహ్లి సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ రన్ మెషీన్ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్న వేళ కోహ్లిపై ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Dravid on Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్ లో 500వ మ్యాచ్ ఆడబోతున్న విరాట్ కోహ్లిపై ఇప్పటికే ఆ ఘనతను సొంతం చేసుకున్న టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ద్రవిడ్ కూడా అంతర్జాతీయ క్రికెట్ లో 509 మ్యాచ్ లు ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి కోహ్లి 15 ఏళ్లవుతోంది. అదే సమయంలో ఈ 500వ మ్యాచ్ రికార్డునూ అందుకోబోతున్నాడు.
ఇప్పటికీ చాలా స్ట్రాంగా, ఫిట్ గా ఉన్నాడు. 500 మ్యాచ్ ల తర్వాత, 13 ఏళ్లు ఆడాక కూడా ఇంత ఉత్సాహంగా ఉండటం అద్బుతం. అది అంత సులువుగా వచ్చేది కాదు. తెర వెనుక చాలా కష్టం దాగుంది. ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఆ కష్టం, త్యాగాలను కొనసాగించడానికి అతడు ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ఎంతో మంది యువ ప్లేయర్స్ కు ఇది స్ఫూర్తిదాయకం" అని ద్రవిడ్ అన్నాడు.
"ఇక్కడ ఏమీ చెప్పాల్సిన పని లేదు. ప్రాక్టీస్ చేయడం, ఫిట్ గా ఉండటం, అలా ముందడుగు వేస్తూ వెళ్లడం చూస్తే చాలు చాలా మంది యువ ఆటగాళ్లకు అదే ప్రేరణ. వాళ్లు కూడా అతన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇంత సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాలంటే ఎంతో హార్డ్ వర్క్, క్రమశిక్షణ, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం ముఖ్యం. ఇవన్నీ కోహ్లిలో ఉన్నాయి" అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
2008లో ద్రవిడ్ ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతున్న సమయంలో విరాట్ కోహ్లి ఆ జట్టులోకి వచ్చాడు. తర్వాత ఏడాదికే వన్డే జట్టులోనూ అడుగుపెట్టాడు. తర్వాత రెండేళ్లకు టెస్టుల్లోకీ వచ్చి ద్రవిడ్ తో కలిసి ఆడాడు. ద్రవిడ్ 2012 జనవరిలో ఆడిన చివరి టెస్టులోనే కోహ్లి తన తొలి టెస్ట్ సెంచరీ చేయడం విశేషం.