Toughest Bowler in India: అతడి బౌలింగ్‌లో ఆడటం ఇబ్బంది.. చిరాకొస్తుంది.. భారత పేసర్‌పై కార్తిక్ షాకింగ్ కామెంట్స్
Toughest Bowler in India: తన కెరీర్‌లో అత్యంత కష్టతరంగా ఫీలయింది మహమ్మద్ షమీ బౌలింగ్‌లోనే అని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు. నెట్స్‌లో అతడితో ఆడేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడినని అన్నాడు.
Toughest Bowler in India: ప్రస్తుతం టీమిండియాకు ప్రపంచంలోనే బెస్ట్ బౌలింగ్ ఎటాక్ ఉంది. ఇందుకు ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టే ఉదాహరణ. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించారు భారత బౌలర్లు. ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ పెవిలియన్‌కు దారి చూపించారు. రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై పేస్ బౌలర్లు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఫలితంగా ఓవర్సీస్‌లోనూ ప్రభావం చూపించే అవకాశముంది. అయితే భారత జట్టులో అత్యంత ప్రమాదకర బౌలర్ ఎవరంటే మాత్రం విభిన్న పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై దినేశ్ కార్తిక్ స్పందించాడు.
"ఈ విషయంలో నన్ను అడిగితే షమీ పేరునే చెబుతాను. షమీ బౌలింగ్‌లో ఆడటం టార్చర్. నా మొత్తం కెరీర్‌లో అతడే కష్టతరమైన బౌలర్. నేను నెట్స్‌లో అతడిని చాలా సార్లు ఫేస్ చేశాను. రెండు, మూడు సార్లు అతడు నన్ను ఔట్ చేశాడు కూడా. నెట్స్‌లో అతడి బౌలింగ్‌లో ఇబ్బందిగా ఉంటుంది. అది కేవలం నాకే నాకే అనుకున్నా. కోహ్లీ, రోహిత్ శర్మను అడిగితే వారు కూడా ఇదే సమాధానం చెప్పారు. వాళ్లందరూ అతడి బౌలింగ్‌లో ఆడటానికి ఇష్టపడరు" అని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు.
షమీ లెంగ్త్ కారణంగానే బౌలింగ్‌లో ఆడేందుకు ఇబ్బంది పడతామని, అప్ రైట్ సీమ్ పొజిషన్ వల్ల ఆడేందుకు కష్టంగా ఉంటుందని దినేశ్ కార్తిక్ తెలిపాడు.
“షమీ బౌలింగ్ అంత ప్రత్యేకంగా ఉండటానికి కారణం.. అతడి అప్ రైట్ సీమ్ పొజిషన్. అతడిది నేచురల్ లెంగ్త్. 6 నుంచి 8 మీటర్ల మార్క్‌లో ఉండే ఆ లెంగ్త్ నెట్స్ ఆడేందుకు ఇబ్బందికి గురిచేస్తుంది. అతడు వేసే బంతుల వల్ల ఎక్కువగా స్లిప్‌లో, వెనక క్యాచ్ వచ్చే అవకాశముంటుంది. ఇదే సమయంలో ఆ లెంగ్త్ కారణంగానే అతడు పరుగులు ధారాళంగా సమర్పించుకుంటున్నాడు. ఇది నిజంగా దురదృష్టమే. ఓవర్సీస్ సిరీస్‌ల్లో బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో ఎక్కువగా పరుగులు చేస్తున్నారు. అలాగే వికెట్లు పెద్దగా పడలేదు.” అని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు.
ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా రెండో టెస్టుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్.. దిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టులోనూ సత్తా చాటాలను భావిస్తోంది. మొదటి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సహా 132 పరుగుల భారీ తేడాతో ఓడించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి పేసర్లు కేవలం 4 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు 20 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజానే 15 వికెట్లు తీశారు.