Dinesh Karthik on Rahul Tripathi: కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేది రాహుల్ త్రిపాఠీ.. దినేష్ కార్తీక్ వింత స్టేట్‌మెంట్
Dinesh Karthik on Rahul Tripathi: కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేది రాహుల్ త్రిపాఠీ అంటూ దినేష్ కార్తీక్ వింత స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అసలు టీమ్ లో ఎప్పుడోసారి చోటు దక్కించుకుంటున్న అతనిపై తనకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అన్నది కూడా కార్తీక్ వివరించాడు.
Dinesh Karthik on Rahul Tripathi: టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. టీ20ల్లో విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ ఎవరో అంచనా వేశాడు. అయితే అందరూ అనుకుంటున్నట్లు అది సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న శుభ్‌మన్ గిల్ కాదు. కార్తీక్ చెప్పినదాని ప్రకారం రాహుల్ త్రిపాఠీయే విరాట్ స్థానాన్ని భర్తీ చేస్తాడట. అది ఎందుకో కూడా కార్తీక్ వివరించాడు.
న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో అందరి కళ్లూ 63 బంతుల్లోనే 126 రన్స్ చేసిన గిల్ పైనే ఉన్నాయి. కానీ అంతకుముందే కివీస్ బౌలర్లను చిత్తుచిత్తుగా కొట్టాడు రాహుల్ త్రిపాఠీ. అతడు కేవలం 22 బాల్స్ లోనే 44 రన్స్ చేశాడు. అతని ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ కార్తీక్ ఈ కామెంట్స్ చేశాడు.
"నేను ఇప్పుడు చెప్పబోయేది రాహుల్ త్రిపాఠీ కోసం కాదు. క్రికెట్ అభిమానులందరి కోసం. భవిష్యత్తులో మరచిపోకండి. కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే వాళ్ల పేర్లు గొప్పవే. అతడు కేవలం 30, 40 స్కోర్లే చేశాడు కదా అని అనొచ్చు.
కానీ అతడు బ్యాటింగ్ కు దిగిన ప్రతిసారి ఉన్న పరిస్థితులు గమనించాలి. తన కెరీర్ కు ముప్పు అని తెలిసినా నిస్వార్థంగా అతడు దూకుడుగా ఆడుతున్నాడు. ఇది చాలా రిస్క్. అయినా చేస్తున్నాడు. ఎందుకంటే తన టీమ్ కచ్చితంగా గెలవాలి అన్న ఉద్దేశంతో.
వచ్చే ఆరు నెలల్లో అతడు ఐపీఎల్లో బాగా ఆడుతుండొచ్చు. లేకపోవచ్చు. కానీ ఇండియన్ టీమ్ లో మూడోస్థానానికి మాత్రం అతడు అర్హుడు. విరాట్ కోహ్లి ఆడాలని అనుకుంటే సరే. కానీ కోహ్లి లేకపోతే మాత్రం రాహుల్ త్రిపాఠీ మొదటి ఛాయిస్ కావాలి. మరో స్థానంలో బాగా ఆడిన ప్లేయర్ కాకూడదు.
తన కెరీర్ కు ముప్పు ఉందని తెలిసినా శ్రీలంకతో చివరి మ్యాచ్ లో అతడు అద్భుతంగా ఆడాడు. అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. అయినా దూకుడుగా, రిస్క్ తీసుకుంటూ ఆడాడు. కెప్టెన్, కోచ్ ఏం ఆశించారో అలాగే ఆడాడు" అని త్రిపాఠీ గురించి కార్తీక్ చెప్పాడు.
శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో రాహుల్ త్రిపాఠీ 16 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ లో త్రిపాఠీతో కలిసి ఆడిన కార్తీక్.. అతనిలో ఉన్న ప్రత్యేకత గురించి కూడా వివరించాడు. "అతని డీఎన్ఏలోనే అతని గొప్పతనం దాగుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎంత పెద్ద మ్యాచ్ అయినా కూడా దూకుడుగా ఆడతాడు. ఇలాంటి ప్లేయర్సే కావాలి. ఎందుకంటే పెద్ద మ్యాచ్ లలో వీళ్లు పరిస్థితులతో సంబంధం లేకుండా తమకు వచ్చిన ఆట ఆడతారు" అని కార్తీక్ చెప్పాడు.
సంబంధిత కథనం