Telugu News  /  Sports  /  Dewald Brevis Hit 57 Ball 162 In Csa T20 Challenge
35 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ చేసిన డివాల్డ్ బ్రెవిస్
35 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ చేసిన డివాల్డ్ బ్రెవిస్

Dewald Brevis: చెలరేగిపోయిన బేబీ ఏబీ.. 57 బాల్స్‌లోనే 162 రన్స్‌

31 October 2022, 21:04 ISTHari Prasad S
31 October 2022, 21:04 IST

Dewald Brevis: బేబీ ఏబీగా పేరుగాంచిన సౌతాఫ్రికా బ్యాటర్‌ డివాల్డ్‌ బ్రెవిస్‌ చెలరేగిపోయాడు. క్రికెట్‌ సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్‌లో అతడు కేవలం 57 బాల్స్‌లోనే 162 రన్స్‌ బాదడం విశేషం.

Dewald Brevis: సౌతాఫ్రికా క్రికెట్‌లో మరో ఏబీ డివిలియర్స్‌ తయారవుతున్నాడు. ఇప్పటికే బేబీ ఏబీగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే డివాల్డ్‌ బ్రెవిస్‌ తాజగా క్రికెట్‌ సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్‌ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. అతడు కేవలం 57 బాల్స్‌లోనే ఏకంగా 162 రన్స్‌ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌ చూసిన ఏబీ డివిలియర్స్‌ ట్విటర్‌ ద్వారా అతనిపై ప్రశంసలు కురిపించాడు.

ట్రెండింగ్ వార్తలు

టైటన్స్‌ తరఫున బరిలోకి దిగిన బ్రెవిస్‌.. నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 సిక్స్‌లు, 13 ఫోర్లతో 162 రన్స్‌ చేశాడు. ఈ మ్యాచ్‌ పోచెఫ్‌స్ట్రూమ్‌లోని సెన్వెస్‌ పార్క్‌లో జరిగింది. బ్రెవిస్‌ సునామీ ఇన్నింగ్స్‌తో మొదట బ్యాటింగ్ చేసిన టైటన్స్‌ 20 ఓవర్లలో ఏకంగా 271 రన్స్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో బ్రెవిస్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అతని దూకుడు టైటన్స్ పవర్‌ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 63 రన్స్‌ చేసింది.

ఆ తర్వాత 35 బాల్స్‌లోనే టీ20ల్లో తన తొలి సెంచరీ చేయడం విశేషం. ఆ తర్వాత అతడు మరింత చెలరేగాడు. తర్వాతి 22 బాల్స్‌లో 62 రన్స్‌ చేశాడు. సిక్స్‌లు, ఫోర్లతో మోత మోగించాడు. బ్రెవిస్‌పై నైట్స్‌ ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. కానీ అందరు బౌలర్లు ఓవర్‌కు 10కిపైగా ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నారు.

బ్రెవిస్‌.. మరో ఓపెనర్‌ జివేషన్‌ పిళ్లైతో కలిసి తొలి వికెట్‌కు 179 రన్స్ జోడించాడు. అటు జివేషన్ కూడా 45 బాల్స్‌లో 52 రన్స్‌ చేశాడు. ఈ ఏడాది మొదట్లో జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో తన క్లాస్ చూపించిన బ్రెవిస్‌కు అప్పటి నుంచీ బేబీ ఏబీగా పేరు పొందాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ అతన్ని కొనుగోలు చేసింది.

ఇక ఈ ఏడాది కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ బ్రెవిస్‌ ఆడాడు. ఓ మ్యాచ్‌లో అతడు వరుసగా ఐదు బాల్స్‌లో ఐదు సిక్స్‌లు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 6 బాల్స్‌లో 30 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. తాజాగా అతడు ఆడిన ఇన్నింగ్స్‌ చూసి ఏబీ డివిలియర్స్‌ ట్వీట్‌ చేశాడు. "డివాల్డ్‌ బ్రెవిస్. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు" అంటూ సింపుల్‌గా బ్రెవిస్‌పై ప్రశంసలు కురిపించాడు.