RCBW vs DCW 2023: బెంగళూరును చిత్తు చేసిన దిల్లీ.. ఘోరంగా ఓడిన స్మృతి జట్టు
RCBW vs DCW 2023: ముంబయి బ్రబౌర్న్ వేదికగా ఆర్సీబీ వుమెన్స్ జట్టుతో జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. దిల్లీ బౌలర్లలో టారా నోరిస్ 5 వికెట్లతో రాణించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ జట్టు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించంది. షెఫాలీ 84 పరుగులతో అదరగొట్టింది.
RCBW vs DCW 2023: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. ముంబయి బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో దిల్లీ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేని ఆర్సీబీ 163 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్మృతీ మంథనా(35), ఎలిస్ పెర్రీ(31), మెగాన్ స్కూట్(30) మెరుపులు మెరిపించినప్పటికీ లక్ష్య ఛేదనకు సరిపోలేదు. దిల్లీ బౌలర్ టారా నోరిస్ 5 వికెట్లతో రాణించి బెంగళూరు పతనాన్ని శాసించింది. మరో బౌలర్ అలీస్ క్యాప్సీ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.

224 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు మంచి ఆరంభమే లభించింది. 4.2 ఓవర్లలోనే 41 పరుగులతో దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆర్సీబీని దిల్లీ బౌలర్ అలైస్ క్యాప్సీ తొలి దెబ్బ కొట్టింది. ఓపెనర్ సోఫీ డివైన్‌ను(14) ఔట్ చేసిన అలైస్.. ఆ కాసేపటికే కెప్టెన్ స్మృతీ మంథనా వికెట్ కూడా తీసింది. దీంతో 56 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. ఆ తర్వాత ఎలైస్ పెర్రీ(31), దిశా కసత్(9) కాసేపు నిలకడగా రాణించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. వీరిద్దరని టారా నోరిస్ ఒకే ఓవర్లో ఔట్ చేసి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్(2), కనిక అహుజా కూడా(0) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. వీరిని కూడా టారా నోరీస్ పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ ఒక్కసారిగా దిల్లీ వైపు తిరిగింది. అప్పటి వరకు గెలుపుపై ధీమాగా ఉన్న ఆర్సీబీ జట్టును టారా నోరిస్ తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
ఈ విధంగా పదే పదే వికెట్లు కోల్పోతూ ఓటమి అంచున నిలిచింది ఆర్సీబీ. చివర్లో హేథర్ నైట్ 19 బంతుల్లో 30 పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగిలిగింది. ఆమె కూడా చివర్లో టారా బౌలింగ్‌లో ఔట్ కావడంతో బెంగళూరు ఓటమి దిశగా ప్రయాణించింది. చివరకు ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 163 పరుగులే చేయగలిగింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టపోయి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ల్యానింగ్(72), షెఫాలీ వర్మ(84) అద్భుత అర్ధశతకాలతో రాణించగా చివర్లో మారిజనా క్యాప్(39) మెరుపులు మెరిపించింది. ఆర్సీబీ బౌలర్లలో హీథర్ నైట్ మాత్రమే 2 వికెట్లు తీసింది.