IPL 2022 DC vs KKR | టాపర్స్‌కు షాక్‌.. కోల్‌కతాను చిత్తుగా ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్‌-dc beat ipl table topper kkr convincingly ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dc Beat Ipl Table Topper Kkr Convincingly

IPL 2022 DC vs KKR | టాపర్స్‌కు షాక్‌.. కోల్‌కతాను చిత్తుగా ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్‌

Hari Prasad S HT Telugu
Apr 10, 2022 07:33 PM IST

ఐపీఎల్‌ 2022లో టేబుల్‌ టాపర్స్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షాకిచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్‌. మొదట 215 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ.. తర్వాత కోల్‌కతాను కట్టడి చేసింది.

4 వికెట్లు తీసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్
4 వికెట్లు తీసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (PTI)

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ గాడిలో పడింది. మూడు విజయాలతో టేబుల్‌ టాపర్స్‌గా ఉన్న కోల్‌కతాను 44 పరుగులతో చిత్తు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (54) ఫైట్‌ చేసినా.. మిగతా బ్యాటర్లు కీలక సమయంలో వికెట్లు పారేసుకోవడంతో కోల్‌కతా 216 పరుగుల భారీ టార్గెట్‌ను చేజ్‌ చేయలేకపోయింది. చివరికి 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది.

ట్రెండింగ్ వార్తలు

216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు అంత మంచి ఆరంభం లభించలేదు. వెంకటేశ్‌ అయ్యర్‌ వరుసగా సిక్స్‌లు కొట్టి ఊపు మీద కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 8 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 21 పరుగులకే కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత రహానే (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో నైట్‌రైడర్స్‌ 4.4 ఓవర్లలో 38 పరుగులకు ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, నితీష్‌ రాణా ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టడంతోపాటు ఢిల్లీ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.

ఎడాపెడా బౌండరీలు బాదారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 42 బంతుల్లో 69 పరుగులు జోడించారు. ఈ దశలో 30 రన్స్‌ చేసిన నితీష్‌ రాణాను లలిత్‌ యాదవ్‌ ఔట్‌ చేయడంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌ మళ్లీ గాడి తప్పింది. ఆ వెంటనే శ్రేయస్‌ అయ్యర్‌ కూడా 54 రన్స్‌ చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి కోల్‌కతాను దారుణంగా దెబ్బ తీశాడు. గత మ్యాచ్‌లో బౌలర్లను ఊచకోత కోసిన ప్యాట్ కమిన్స్‌ ఈ మ్యాచ్‌లో 4 రన్స్‌కే ఔటయ్యాడు. ఓ వైపు రసెల్‌ క్రీజులో ఉన్నా.. అతనికి మరోవైపు నుంచి సహకారం అందలేదు.

చెలరేగిన వార్నర్, పృథ్వి

అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్లు. ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్న బ్రాబౌర్స్‌ స్టేడియంలోని పిచ్‌పై మరోసారి 200కుపైగా స్కోరు సాధించారు. ఓపెనర్లు పృథ్వి షా, డేవిడ్‌ వార్నర్‌ హాఫ్‌ సెంచరీలు.. చివర్లో శార్దూల్‌, అక్షర్‌ మెరుపులతో ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 రన్స్‌ చేసింది. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 20 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. ఉమేష్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19 ఓవర్లో శార్దూల్‌ రెండు సిక్స్‌లు, అక్షర్‌ ఒక సిక్స్‌, ఒక ఫోర్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చివరికి శార్దూల్‌ 11 బంతుల్లో 29, అక్షర్‌ 14 బంతుల్లో 22 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, పృథ్వి షా కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ కలిసి 8.4 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. తొలి ఓవర్‌ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డారు. పృథ్వి షా 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. చివరికి 29 బంతుల్లో 51 రన్స్‌ చేసి ఔటవడంతో వీళ్ల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే అతడు ఔటైన తర్వాత కూడా ఢిల్లీ జోరు కొనసాగింది. వార్నర్‌తో కలిసిన కెప్టెన్‌ పృథ్వి షా కేకేఆర్‌ బౌలర్లపై దాడిని కొనసాగించారు.

ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 25 బంతుల్లోనే 55 రన్స్‌ జోడించడం విశేషం. పంత్ 14 బంతుల్లోనే 27 రన్స్‌ చేసి రసెల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ సమయానికి ఢిల్లీ 12.5 ఓవర్లలోనే 148 రన్స్‌ చేసింది. అయితే పంత్‌ ఔటైన తర్వాత ఢిల్లీ తడబడింది. ఆ వెంటనే వార్నర్‌ (45 బంతుల్లో 61), రోవ్‌మన్‌ పావెల్‌ వికెట్లు కూడా కోల్పోయింది. దీంతో ఢిల్లీ 200 స్కోరైనా సాధిస్తుందా అనిపించింది. అయితే చివర్లో అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ మెరుపులతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది.

WhatsApp channel

టాపిక్