Kaneria about Rishabh Pant: పంత్‌పై పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు.. అతడు వైట్ బాల్ క్రికెటర్ కాదని స్పష్టం
Kaneria about Rishabh Pant: రిషబ్ పంత్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నా అతడు నిరూపించుకోలేకపోతున్నాడని, అతడు వైట్ బాల్ క్రికెటర్ కాదని స్పష్టం చేశాడు.
Kaneria about Rishabh Pant: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతుండటం టీమిండియా పాలిట గుదిబండగా మారింది. అతడికి ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్ ఉన్నప్పటికీ సెలక్టర్లు మళ్లీ మళ్లీ పంత్‌కే అవకాశం కల్పిస్తున్నారు. ఆదివారం నుంచి జరగనున్న బంగ్లాదేశ్ పర్యటనకు కూడా పంత్ వైపే మొగ్గు చూపారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా స్పందించాడు. పంత్ వైట్ బాల్ క్రికెటర్ కాదని ఇండియా అర్థం చేసుకోవాలని స్పష్టం చేశాడు.
"రిషబ్ పంత్ వైట్ బాల్ క్రికెటర్ కాదనే నిజాన్ని భారత్ అంగీకరించి తీరాలి. బ్యాటింగ్ ఆర్డర్‌లో అతడిని ప్రతి స్థానంలో ఆడించారు. కానీ అతడు మాత్రం పరుగులు తీయడంలో విఫలమవుతున్నాడు. కానీ సంజూ శాంసన్ ఏం చేశాడు? అతడు 36 పరుగుల చేసి ఏమైనా తప్పు చేశాడా?" అని కనేరియా తన యూట్యూబ్ ఛానల్‌లో స్పష్టం చేశాడు.
ఇటీవల జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో సంజూ శాంసన్‌ను కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనే ఆడించారు. అందులోనూ 36 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో పంత్‌కే తమ ఓటేశారు. సంజూ శాంసన్‌ను తీసుకోకపోవడంపై సోషల్ మీడియా వేదికగా అతడికి మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపై తమ అసంతృప్తి బహిరంగంగానే తెలియజేస్తున్నారు. పంత్ తను ఆడిన గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 3,6,6,11,15,10 పరుగులు మాత్రమే చేశాడు.
డిసెంబరు 4 నుంచి టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. బంగ్లాతో 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ పర్యటనకు కూడా సంజూ శాంసన్‌కు బదులు పంత్‌నే ఎంపిక చేశారు.
సంబంధిత కథనం