Cristiano Ronaldo Watches: క్రిస్టియానో రొనాల్డో వాచీలు.. ఆ రెండు మోడల్స్ ధర తెలిస్తే షాకే
Cristiano Ronaldo Watches: క్రిస్టియానో రొనాల్డో తన సొంత లగ్జరీ వాచ్ కలెక్షన్ మొదలుపెట్టాడు. జేకబ్ అండ్ కోతో కలిసి ఈ స్టార్ ఫుట్‌బాలర్ సొంతంగా రెండు మోడల్స్ వాచీలను తీసుకురావడం విశేషం. అయితే ఈ వాచీల ధర తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం.
Cristiano Ronaldo Watches: క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచ చరిత్రలోని మేటి ఫుట్‌బాలర్స్ లో ఒకడు. పోర్చుగల్ కు చెందిన ఈ స్టార్ ప్లేయర్ ఇప్పుడు సొంతంగా లగ్జరీ వాచీలను తయారు చేస్తున్నాడు. ప్రముఖ లగ్జరీ వాచీల తయారీ సంస్థ జేకబ్ అండ్ కోతో చేతులు కలిపిన రొనాల్డో.. రెండో ఖరీదైన మోడల్స్ వాచీలను తీసుకొచ్చాడు.
క్రిస్టియానో రొనాల్డో లగ్జరీ వాచీలు
క్రిస్టియానో రొనాల్డో తన వాచ్ కలెక్షన్ ను జేకబ్ అండ్ కోతో కలిసి తీసుకు రావడం విశేషం. ఇందులో ఫ్లైట్ ఆఫ్ సీఆర్7, హార్ట్ ఆఫ్ సీఆర్7 మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ లోనూ 44 ఎంఎం కేస్ ఉంటుంది. అంతేకాదు వీటిలో రొనాల్డో కెరీర్లోని ముఖ్యమైన ఈవెంట్స్ కు సంబంధించిన విశేషాలు కూడా ఉంటాయి.
ఈ వాచీల విషయాన్ని రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. "నా సొంత వాచ్ కలెక్షన్ ఉండాలని నేనెప్పుడూ కలలు కనేవాడిని. ఫీల్డ్ లో నా అత్యంత ఐకానిక్ మూమెంట్స్ ను తీసుకొని జేకబ్ అండ్ కో ఫ్లైట్ ఆఫ్ సీఆర్7, హార్ట్ ఆఫ్ సీఆర్7 వాచీలను తీసుకొచ్చింది. నాకు ఎంత నచ్చాయో మీకు కూడా అంతే నచ్చుతాయని భావిస్తున్నాను" అని రొనాల్డో అన్నాడు.
సీఆర్7 వాచీల ధరలు ఎంతంటే?
సీఆర్7 లగ్జరీ వాచీల ధరలు చాలా ఘాటుగానే ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ ను తీసుకొస్తున్నట్లు రెండేళ్ల కిందట ఫుట్ బాల్ వరల్డ్ కప్ సందర్భంగానే అనౌన్స్ చేయగా.. తాజాగా ఇవి మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండు మోడల్స్ వాచ్ లను స్టీల్, రోజ్ గోల్డ్ లలో అందుబాటులో ఉంటాయి.
ఇందులో హార్ట్ ఆఫ్ సీఆర్7 వాచ్ ధర ఏకంగా రూ.30 లక్షలు కావడం విశేషం. ఫ్లైట్ ఆఫ్ సీఆర్ 7 ధర రూ.70 లక్షల వరకు ఉంది. సీఆర్7 అంటే క్రిస్టియానో రొనాల్డో 7. సీఆర్7 అతని బ్రాండ్ పేరు. 7 రొనాల్డో జెర్సీ నంబర్ అన్న విషయం తెలిసిందే. ప్రతి వాచ్ పై సీఆర్7 లోగోతోపాటు అతని సిగ్నేచర్ కూడా ఉంటుంది.
రొనాల్డో కెరీర్ ఇలా..
క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ చరిత్రలోని ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్స్ లో ఒకడిగా పేరుగాంచాడు. ప్రస్తుతం సౌదీ ప్రొ లీడ్ లో అల్ నసర్ తరఫున ఆడుతున్నాడు. ఐదుసార్లు బ్యాలన్ డోర్, మూడుసార్లు యూఈఎఫ్ఏ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు, నాలుగు యురోపియన్ గోల్డెన్ షూస్ అవార్డులు అందుకున్న ఘనత రొనాల్డో సొంతం.
కెరీర్లో అతడు మొత్తంగా 33 ట్రోఫీలు అందుకున్నాడు. అందులో ఐదు ఛాంపియన్స్ లీగ్స్, 2016లో యూరో కప్, నేషన్స్ లీగ్ ట్రోఫీలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రముఖ అథ్లెట్లలో ఒకడు. ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి రొనాల్డోనే. 2016, 2017, 2023లలో ఫోర్బ్స్ అత్యధిక మొత్తం అందుకున్న అథ్లెట్ గా నిలిచాడు. కెరీర్లో బిలియన్ డాలర్లు పొందిన తొలి ఫుట్‌బాలర్ గా కూడా రొనాల్డోకు పేరుంది.