Ronaldo | ఫుట్‌బాల్‌ చరిత్రలో రొనాల్డో సరికొత్త రికార్డు-cristiano ronaldo is now all time high scorer in professional football ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cristiano Ronaldo Is Now All Time High Scorer In Professional Football

Ronaldo | ఫుట్‌బాల్‌ చరిత్రలో రొనాల్డో సరికొత్త రికార్డు

Hari Prasad S HT Telugu
Mar 13, 2022 06:07 AM IST

పోర్చుగల్‌ సూపర్‌స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.

ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన రొనాల్డో
ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన రొనాల్డో (REUTERS)

మాంచెస్టర్‌: పోర్చుగల్‌, మాంచెస్టర్‌ యునైటెడ్‌ స్టార్‌ రొనాల్డో చాలా రోజుల తర్వాత మరోసారి హ్యాట్రిక్‌ సాధించాడు. టోటెన్‌హామ్‌తో మ్యాచ్‌లో మూడు గోల్స్‌తో దశాబ్దాల రికార్డును కూడా తిరగరాశాడు. ఇప్పుడు ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసింది రొనాల్డోనే. 

ట్రెండింగ్ వార్తలు

పోర్చుగల్‌తోపాటు తాను ఆడిన క్లబ్స్‌కు కలిపి ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో ఇప్పటి వరకూ రొనాల్డో చేసిన గోల్స్‌ సంఖ్య 807కు చేరింది. ఈ క్రమంలో అతడు చెక్‌ ప్లేయర్‌ జోసెఫ్‌ బైకన్‌ను అధిగమించాడు. నిజానికి జోసెఫ్‌కు సంబంధించిన అధికారిక రికార్డు ఫిఫా దగ్గర లేకపోయినా.. అతడు 805 గోల్స్‌ చేశాడని ఓ అంచనా మాత్రం ఉంది. అతడు 1931-55 మధ్య ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో ఈ గోల్స్‌ చేశాడు. 

తాజాగా టోటెన్‌హామ్‌తో మ్యాచ్‌లో మూడు గోల్స్‌ చేసిన రొనాల్డో.. ఆ రికార్డును తుడిచిపెట్టేశాడు. రొనాల్డో జోరుతో మాంచెస్టర్‌ టీమ్‌ 3-2తో టోటెన్‌హామ్‌ను చిత్తు చేసింది. గత పది మ్యాచ్‌లలో కేవలం ఒక్క గోలే చేసి విమర్శలు ఎదుర్కొన్న రొనాల్డో.. ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. 12వ నిమిషంలో తన తొలి గోల్‌ నమోదు చేసిన రొనాల్డో.. జోసెఫ్‌ 805 గోల్స్‌ రికార్డును సమం చేశాడు. ఆ తర్వాతి గోల్‌తో జోసెఫ్‌ రికార్డును తిరగరాశాడు. 

రొనాల్డో కెరీర్‌లో ఇది 59వ హ్యాట్రిక్‌ కావడం విశేషం. మాంచెస్టర్‌ యునైటెడ్‌కు తిరిగి వచ్చిన తర్వాత సాధించిన తొలి హ్యాట్రిక్‌. ఆ టీమ్‌ తరఫున చివరిసారి 2008లో రొనాల్డో హ్యాట్రిక్‌ గోల్స్‌ చేశాడు. తిరిగి వచ్చిన తర్వాత సాధించిన ఈ తొలి హ్యాట్రిక్‌ తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మ్యాచ్‌ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో అన్నాడు. రొనాల్డో తన కెరీర్‌లో చేసిన 807 గోల్స్‌.. పోర్చుగల్‌తోపాటు స్పోర్టింగ్‌, యునైటెడ్‌, రియల్ మాడ్రిడ్‌, జువెంటస్‌ తరఫున నమోదు చేశాడు. 

అయితే జోసెఫ్‌ నిజానికి 805 గోల్స్‌ కాదు.. 821 గోల్స్‌ చేశాడని చెక్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ చెబుతోంది. నిజానికి ఫుట్‌బాల్ చరిత్రలో బ్రెజిల్‌ స్ట్రైకర్స్‌ అయిన పీలే, రొమారియో వెయ్యికిపైగా గోల్స్‌ సాధించినా.. వాటిలో అనధికారిక, ఫ్రెండ్లీ, అమెచ్యూర్‌ మ్యాచ్‌లలో చేసిన గోల్స్‌ కూడా ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్