Cristiano Ronaldo World Record: క్రిస్టియానో రొనాల్డో వరల్డ్‌ రికార్డ్‌.. ఘనాపై గోల్‌తో కొత్త చరిత్ర-cristiano ronaldo creates world record with the goal against ghana ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cristiano Ronaldo Creates World Record With The Goal Against Ghana

Cristiano Ronaldo World Record: క్రిస్టియానో రొనాల్డో వరల్డ్‌ రికార్డ్‌.. ఘనాపై గోల్‌తో కొత్త చరిత్ర

Hari Prasad S HT Telugu
Nov 25, 2022 08:31 AM IST

Cristiano Ronaldo World Record: క్రిస్టియానో రొనాల్డో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఘనాతో జరిగిన మ్యాచ్‌లో గోల్‌ చేసిన అతడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.

రొనాల్డో గోల్ సెలబ్రేషన్
రొనాల్డో గోల్ సెలబ్రేషన్ (AP)

Cristiano Ronaldo World Record: మాంచెస్టర్‌ యునైటెడ్‌ వివాదం, క్లబ్‌ మ్యాచ్‌ తర్వాత దురుసు ప్రవర్తనతో జరిమానా, నిషేధంలాంటివి ఎదుర్కొని కష్టాల్లో ఉన్న పోర్చుగల్ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మొత్తానికి ఓ రికార్డుతో మళ్లీ గాడిలో పడ్డాడు. నేను రికార్డులను ఫాలో కాను.. నన్నే రికార్డులు ఫాలో అవుతాయనే బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన రొనాల్డోను నిజంగానే రికార్డులు ఫాలో అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఘనాతో మ్యాచ్‌లో గోల్ చేసిన అతడు చరిత్ర సృష్టించాడు. తాను ఆడిన ప్రతి ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌లో గోల్ చేసిన అరుదైన ఘనతను రొనాల్డో సొంతం చేసుకున్నాడు. గ్రూప్‌ హెచ్‌లో ఘనాతో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్‌ 3-2తో గెలవగా.. అందులో రొనాల్డో ముఖ్యమైన గోల్‌ ఒకటి చేశాడు. దీంతో ఐదు ఫిఫా వరల్డ్‌కప్‌లలో గోల్‌ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.

37 ఏళ్ల రొనాల్డో ఇప్పుడు 2006, 2010, 2014, 2018, 2022 వరల్డ్‌కప్‌లలో గోల్స్‌ చేశాడు. ఈ క్రమంలో అతడు మెస్సీ, పీలే, సీలర్‌, క్లోజ్‌లాంటి లెజెండరీ ప్లేయర్స్‌ను వెనక్కి నెట్టాడు. ఈ నలుగురూ నాలుగు వరల్డ్‌కప్‌లలో గోల్స్‌ చేశారు. ఈ మధ్యే సౌదీ అరేబియాపై గోల్‌తో మెస్సీ వీళ్ల సరసన చేరిన విషయం తెలిసిందే.

ఘనాతో మ్యాచ్‌లో 65వ నిమిషంలో లభించిన పెనాల్టీని రొనాల్డో విజయవంతంగా గోల్‌గా మలిచి రికార్డు బుక్కుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌కు కీలకమైన 3-2 లీడ్‌తో మ్యాచ్‌ను గెలిచేలా చేసింది రొనాల్డో గోలే. మ్యాచ్‌ తర్వాత తన రికార్డుపై రొనాల్డో స్పందించాడు.

"నా ఐదో వరల్డ్‌కప్‌లో ఇదొక అద్భుతమైన అనుభూతి. మేం గెలిచాం. మంచి ఆరంభం లభించింది. ఇది చాలా ముఖ్యమైన విజయం. ఇలాంటి కండిషన్స్‌లో తొలి మ్యాచ్‌ ముఖ్యమైనదని మాకు తెలుసు. ఇది మరొక రికార్డు కూడా. ఇది నాకు గర్వకారణం. చాలా ఆనందంగా ఉంది. కాస్త కష్టంగానే కానీ గెలిచాం" అని రొనాల్డో అన్నాడు. ఇక గ్రూప్‌ హెచ్‌లో వచ్చే మంగళవారం ఉరుగ్వేతో పోర్చుగల్‌ కీలకమైన మ్యాచ్‌ ఆడనుంది. ఇందులో గెలిస్తే ఆ టీమ్‌ ప్రీక్వార్టర్స్‌లోకి చేరినట్లే.

WhatsApp channel